calender_icon.png 26 December, 2024 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తక ప్రియుల సందడి

25-12-2024 12:51:48 AM

బుక్‌ఫెయిర్ డే-6

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ మంగళవారం (6వ రోజు) పుస్తక ప్రియుల సందడితో కోలాహలంగా కొనసాగింది.  అక్షరయాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఉమెన్ రైటర్స్ స్టాల్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

సుమారు 51 మందికి పైగా కవయిత్రులు, రచయిత్రుల కవితలు, కథలు, నవలలు పుస్తకాలు స్టాల్ నంబరు 5లో లభ్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ సాహిత్య అకాడమీ స్టాల్ నంబరు 350లో హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం, కాకతీయుల చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పలు పుస్తకాలు ఆకట్టుకుంటున్నాయి. 

తెలంగాణ భాషా సాంస్కృతి కశాఖ స్టాల్ నంబర్ 2లో తెలంగాణ సాహిత్య ప్రస్థానం, గోల్కొండ చరిత్ర, తెలంగాణ ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు, బోనాలు, 655 కవితల పుస్తకం కరోనాకు రిటర్న్ గిఫ్ట్, తెలంగాణ గిరిజనుల సంస్కృతి, కాకతీయ డైనెస్టీ తదితర పుస్తకాలు లభ్యమవుతున్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ మంగళవారం 6వ రోజు పుస్తక ప్రియుల సందడితో కోలాహలంగా కొనసాగింది.

ఈ సందర్భంగా డాక్టర్ బోయి విజయభారతి వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నాకు స్ఫూర్తినిచ్చిన పుస్తకంపై పలువురు తమ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  ప్రముఖ వాగ్గేయకారుడు జయరాజు మాట్లాడుతూ.. ఒక పుస్తకం మనిషిని ఎలా జీవించేలా చేస్తుందని చెప్పడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన దినచర్య పుస్తకం ఉదాహరణ అని చెప్పారు.

అంబేద్కర్ దినచర్య పుస్తకం చదవడం ద్వారానే నేను బతికగలిగాను అని అన్నారు. 15 పేజీలు మాత్రమే ఉండే ఆపుస్తకం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన సమగ్ర తెలంగాణ సాహిత్యం, టెడ్ అలెన్ సిడ్నీ అలెనై రచించిన డైలెక్టికల్ మెటీరియలిజం, తోపుడుబండి సాదిక్ వేదికలో జీఎన్ సాయిబాబా స్ఫూర్తి కవిత్వం  నువ్వెళ్లిన దారిలో పుస్తకం తదితర పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్, వీక్షణం వేణుగోపాల్, బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.