calender_icon.png 5 November, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

05-11-2024 12:40:45 AM

లోగోను ఆవిష్కరించిన ప్రొ.కోదండరాం తదితరులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19వ తేదీ నుంచి 29వ వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ మహోత్సవం జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ కమిటీతో పాటు బుక్ ఫెయిర్ సలహాదారులు ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీనియర్ ఎడిటర్ కే రామచంద్రమూర్తితో కలిసి ఎమ్మెల్సీ, ప్రొ. కోదండరాం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బుక్ ఫెయిర్ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాహితీ ప్రియులు, పాఠకులు, విద్యార్థులు, యువత ఎంతోమంది బుక్ ఫెయిర్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. బుక్ ఫెయిర్ వేదిక రచయితలను, పాఠకులను కలుపుతూ ప్రత్యేకతను సంతరించుకుంటుందని పేర్కొన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా పుస్తకాలకు ఆదరణ తగ్గలేదన్నారు.

అనంతరం బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, కవి యాకుబ్, ప్రధాన కార్యదర్శి వాసు మాట్లాడుతూ.. ఈ ఏడాది బుక్ ఫెయిర్‌ను గతం కంటే భిన్నంగా నిర్వహిస్తున్నామన్నారు. కోల్‌కతా, జైపూర్ మాదిరిగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. ప్రాంగణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిస్తున్నామని, సందర్శకుల కోసం టికెట్లతో పాటు పుస్తకాల సంచిని కూడా  ఇవ్వబోతున్నట్టు చెప్పారు.

విద్యార్థులకు గుర్తింపు కార్డు ద్వారా ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ కోశాధికారి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కే బాల్‌రెడ్డి, శోభన్‌బాబు, సహాయ కార్యదర్శి కే సురేశ్, ఎం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.