calender_icon.png 20 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మిన వారానికే 5౦౦ బోనస్

20-11-2024 01:31:06 AM

  1. రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు 
  2. ధాన్యం సేకరణ మరింత వేగవంతం 
  3. సన్నాలపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు  
  4. సీఎంఆర్ చేయకుండా మిల్లర్లు మొండికేస్తే సేకరించిన ధాన్యం గోదాముల్లో భద్రపరుచుతాం
  5. డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులు జప్తుకు రంగం సిద్ధం  
  6. ‘విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు చేసిన వారంలోనే రైతుల ఖాతాల్లో రూ.5౦౦ బోనస్ జమచేస్తామని పౌరసరఫరాల సంస్థ కమిషనర్, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ తెలిపారు. గడువులోగా ధాన్యం కొనుగోలు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.

మిల్లర్లు కల్లాల వద్దకు వెళ్లి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి స న్నాలు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి తాము కేటాయించిన వడ్లను తీసుకెళ్లి గడువులో తిరిగి ఇవ్వాలని సూచించారు. సీఆర్‌ఎంఆర్ చేయకుండా మొండికేసే మిల్లర్లపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కొనుగోలు చేసిన వడ్లను స్థానికంగా ఉండే గోదాములకు తరలిస్తున్నామని, వాటిని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన మిల్లులకు కేటాయిస్తామని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తేమశాతం, తాలు, తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం ‘విజయక్రాంతి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ పలు విషయాలు వెల్లడించారు.  

రాష్ట్రంలో సన్న ధాన్యం సేకరణ ఎలా ఉంది?

కొనుగోలు కేంద్రాలకు సన్నదాన్యం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రారంభంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావించాం. ఆ తరువాత 40 లక్షల మెట్రిక్ టన్నుల వస్తుందని అంచ నా వేశాం. పరిస్థితులను చూస్తే 35 లక్షల మెట్రిక్ టన్నుల రావచ్చు.  

మిల్లర్లు సన్నవడ్లు భారీగా కొనుగోలు చేశారు కదా? 

ఈసారి అక్టోబర్‌లో వరి కోతకు వచ్చింది. కోసింది కోసినట్టు రైతులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. ఇదే అదునుగా భావించిన మిల్లర్లు పెద్దమొత్తంలో కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కొంత ఆలస్యం అయ్యింది. దీంతో చాలామంది రైతులు మిల్లర్లకు ధాన్యాన్ని అమ్మేశారు. ఇప్పటివరకు దళారుల సహాయంతో మిల్లర్లు 18 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. త్వరలో మిల్లులను తనిఖీ చేసి అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుంటాం. 

కొనుగోలు కేంద్రాలను ఎప్పటివరకు నడిపిస్తారు? 

ఈసారి పెద్ద మొత్తంలో సన్నధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 8,806 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 7,532 కేం ద్రాలు రైతులకు అందుబాటులో ఉంచాం. ఇప్పటివరకు రైతుల నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.

కొనుగోలు కేంద్రాలు వచ్చే జనవరి 31 వరకు రైతులకు అందుబాటులో ఉంటాయి. కేంద్రాల్లో తగిన వసతులు ఏర్పాటు చేశాం. రైతులు ధాన్యం ప్రైవేటు మిల్లర్లకు అమ్మకోవద్దు. దళారుల మాటల నమ్మొద్దు. బోనస్‌తోపాటు ధాన్యం డబ్బులు వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఆలస్యం చేస్తుందనే ప్రచారం గురించి రైతులు పట్టించుకోవద్దు.

ఎన్ని మిల్లులు డిఫాల్టర్లుగా తేల్చారు? వాటిపై చర్యలేంటి? 

రాష్ట్ర వ్యాప్తంగా 362 మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించాం. వీటికి ఒక గింజ కేటాయించబోం. వారినుంచి రూ.3,200 కోట్ల విలువైన సీఎంఆర్ రావాల్సి ఉంది. రెవెన్యూ రికవరి యాక్ట్‌తోపాటు కేసులు నమోదు చేశాం. ఆర్‌ఆర్ యాక్ట్ కింద రూ.40 కోట్లు, 77 క్రిమినల్ కేసులు నమోదు చేసి రూ.1,281 కోట్లు రికవరీ చేశాం. జీవో నంబర్ 11లో సవరణలు చేసి ప్రాపర్టీని అమ్ముకోవడానికి చర్యలు చేపట్టాం. 

అక్రమార్కులపై 402 కేసులు, 351 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిం చాం. రూ.38.74 కోట్ల విలువైన 48,129 క్వింటాళ్ల అక్రమ ధాన్యం సీజ్ చేశాం. బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన మిల్లులకు మాత్రమే ధాన్యం ఇస్తాం. కరీంనగర్ జిల్లాలో ఒక మిల్లు ఆస్తులను వేలం వేశాం. 

సన్నాలకు బోనస్‌లో జాప్యం ఎందుకు? 

సన్న ధాన్యం అమ్మకాలు చేసే రైతులకు బోనస్ రూ.500 జమ చేయడంతో జాప్యం జరుగుతుందనే మాట నిజమే. బ్యాంకుల్లో కొన్ని సాంకేతిక కారణాల ద్వారా ఆలస్యమైతుంది. ప్రభుత్వం ఇప్పటికే బోనస్ కోసం తగిన నిధులు కేటాయించింది. గత వారం జరిగిన ఆలస్యానికి మిల్లర్లు అనవసరంగా ప్రచారం చేస్తున్నారు.

వానకాలం పంట ముందే సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పడంతో గతంలో కంటే 61 శాతం సన్నాల సాగు పెరిగింది. యాసంగిలో సుమారుగా 45 లక్షల ఎకరాల్లో సన్నవరి సాగు చేసే అవకాశముంది. బోనస్ కారణంగా రైతులు సన్నాలు వేసేందుకు ముందుకొచ్చే అవకాశముంది.