22-04-2025 01:30:46 AM
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయలను బోనస్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని, దేశంలో ఈ విధానం ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.
సోమవారం డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని కందికొండ, చింతపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గత ప్రభుత్వ హాయంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో అనేక కొర్రీలు పెట్టడం, కోతలు పెట్టడం జరిగేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రోత్సాహక పథకాలు అమలు చేయడంతో పాటు కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.