calender_icon.png 26 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణీయులకు ‘బోనస్’

26-10-2024 01:39:20 AM

  1. ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ
  2. సంస్థ వ్యాప్తంగా 40 వేల మంది ఫుల్ ఖుష్  

 భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): సింగరేణి లాభాల్లో  కార్మికుల వాటా కింద ఇప్పటికే రూ.796 కోట్లు అందజేసిన యాజమాన్యం.. శుక్రవారం మరో రూ.358 కోట్లను దీపావళి బోనస్ కింద వారి ఖాతాల్లో జమ చేసింది. యాజమాన్యం ఏటా ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్(పీఎల్‌ఆర్‌ఎస్)పేరుతో ఉద్యోగులకు దీపావళి బోనస్ అందిస్తుంది.

దీనిలో భాగంగా ఈసారి కూడా వారికి బోనస్ అందింది. గతేడాది చెల్లించిన బోనస్ కంటే ఈసారి కార్మికులకు చెల్లించే బోనస్ రూ.50 కోట్లు అధికం. దీనిలో భాగంగా ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 చొప్పున జమ అయింది. ఇలా సంస్థవ్యాప్తంగా దాదాపు 40,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరింది. ఇలా యాజమాన్యం నెల రోజుల వ్యవధిలోనే కార్మికులకు రూ.1,250 కోట్లు లాభాలు చెల్లించినట్లయింది.

సింగరేణి విస్తరణకు సహకారం అవసరం..

సింగరేణి విస్తరణకు కార్మిక సంఘాల సహకారం అవసరమని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అన్నారు. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో శుక్రవారం నిర్వహించిన గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక నాయకుల నాలుగు రోజుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉద్యోగులు పూర్తి పనిగంటలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యంత్రాలను వినియోగించి ఉత్పాదకతను పెంచాలని పిలుపునిచ్చారు. ఉత్పాదకతపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, దీనిలో భాగంగానే కార్మిక సంఘాల నాయకులను విదేశీ పర్యటనకు పంపించే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు.