calender_icon.png 29 April, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో బాండ్ పేపర్ల దందా

29-04-2025 12:07:59 AM

  1. కొరత లేకున్నా దోచుకుంటున్న స్టాంప్ వెండర్లు
  2. రూ.100 పేపర్ రూ.50వరకు అదనం
  3. అన్ని రకాల డ్రాఫ్ట్లను  రాసిస్తున్నందున వారి వద్దకే వెళ్తున్న ప్రజలు

సూర్యాపేట, ఏప్రిల్28(విజయక్రాంతి):  స్టాంప్ వెండర్లు బాండ్ పేపర్ల కొరత లేకున్నా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో దానిపై డబుల్ రేటు వసూలు చేసి, జనాల జేబు లకు చిల్లులు పెడుతున్నారు. వీరిపై పర్యవేక్షణ లేనందునే అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయవిక్రయాలు జరగాలంటే ముందుగా బాండ్ పేపర్ కొనాలి. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఓసారి, అగ్రిమెంట్ చేసుకున్నపుడు మరోసారి, చివరకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా ఈ బాండ్పేపర్ కావాలి. ఇలా భూముల క్రయ విక్రయాలతోపాటు డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు కూడా బాండ్ పేపర్ మీద రాసుకుని సంతకాలు పెట్టించుకుని ఇస్తారు.

అప్పుడే ఇరువురికీ నమ్మకం ఉంటుంది. అయితే వ్యాపారులు బాండ్ పేపర్ల విషయంలో వెండర్లు అక్రమ దందా సాగిస్తున్నారు. రూ.50 బాండ్ పేపర్ ను రూ.70, రూ. 100 పేపర్ ను రూ. 150 నుంచి రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. 

150కి పైగా స్టాంప్ వెండర్లు

జిల్లాలో  150కి పైగా స్టాంప్ వెండర్లు బాండ్ పేపర్లను విక్రయిస్తున్నారు. సూర్యాపేట సబ్ రిజిస్టర్ పరిధిలో 54 మంది స్టాంపు వెండర్లు వీరంతా ఫీజు చెల్లించి, అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్ శాఖనుంచి బాండ్ పేపర్లు తీసుకెళ్ళి విక్రయిస్తున్నారు.  వీరి వద్దే అన్ని రకాల డ్రాఫ్ట్లను బాండ్ పేప్ప రాసిస్తున్నందున ప్రజలు ఈ బాండ్ పేపర్ల కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళకుండా నేరుగా వీరి వద్దకే వెళ్తున్నారు.

అందుకే వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్ను బట్టే బాండ్ పేపర్లు దొరకడం లేదని డబుల్ రేటుకు విక్రయిస్తున్నారు. పాత తేదీలలో బాండ్లు కావాలంటే ఇంకా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది స్టాంప్ వెండర్ల వద్ద పాత తేదీలకు సంబంధించిన బాండ్లు రెడీగా ఉంటాయి.

జనాల అవసరాన్ని బట్టి అధికంగా డబ్బులు తీసుకుని వాటిని ఇస్తుంటారు. వీరిపై పర్యవేక్షణ లేని కారణంగానే విచ్చలవిడిగా ధరలు పెంచుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ స్టాంప్ వెండర్ల దుకాణాలను అప్పుడప్పుడు తనిఖీలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు

బాండ్ పేపర్ల కొరత లేదు. కావలసినన్ని బాండ్లు సిద్ధంగా ఉన్నాయి. అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎక్కువ ధరలకు బాండ్ పేపర్లు అమ్మినవారిపపై కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు.

 అంబేద్కర్, సబ్ రిజిస్టర్, సూర్యాపేట