calender_icon.png 23 January, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహారీ బాబులకు బొనాంజా!

24-07-2024 01:08:23 AM

మోదీ ౩.౦ వికసిత భారత్

పార్లమెంట్‌లో ఏడోసారి.. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

చంద్రబాబుకు సలాములు.. తెలంగాణకు సున్నాలు

యువత, ఉపాధి, మహిళలు, సాగుపై ఫోకస్

సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యాలకు ప్రతిబింబంగా బడ్జెట్

48.21 లక్షల కోట్లతో పూర్తిస్థాయి పద్దు

నికర పన్నుల రాబడి 25 లక్షల కోట్లే

ఐదేండ్లలో 4 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యం

మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చిన బడ్జెట్

మౌలిక సదుపాయాల కల్పనకు 11 లక్షల కోట్లు

సబ్సిడీలకు మరోసారి కోతపెట్టిన సర్కారు

కొత్త పన్నుల విధానంలో స్వల్ప మార్పులు

వేతనజీవులకు పన్ను రిటర్న్ కొద్దిగా పెంపు

నిరుద్యోగులకు పథకాలు, విద్యార్థులకు రుణాలు

పట్టణ పేదలకు మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణం

* లోక్‌సభ ఎన్నికల్లో అతివిశ్వాసానికి పోయి ఊహించని దెబ్బతిన్న బీజేపీ.. మళ్లీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనే చర్యలు మొదలు పెట్టింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూపొందించిన తొలి బడ్జెట్‌లో సంకీర్ణ పార్టీలను ప్రసన్నం చేసుకొంటూనే.. దేశంలోని ప్రధాన వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. ఇందులో మోదీ సర్కారు తన ప్రభుత్వాన్ని కాపాడుతున్న బీహారీ ‘బాబు’కు, ఏపీ ‘బాబు’కు అడిగినన్ని నిధులిచ్చింది. అవసరమైతే మరిన్ని ఇస్తామని నిర్మలమ్మ వాగ్దానం చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అధిక ప్రాధాన్యమిచ్చిన మోదీ సర్కారు.. తెలంగాణ గురించి అస్సలు పట్టించుకున్నట్టు కనిపించలేదు. 

న్యూఢిల్లీ, జూలై 23: మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని నరేంద్రమోదీ.. తాజా బడ్జెట్‌ను అందుకు తగ్గట్టే రూపొందిం చారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఊతకర్రల్లాగా నిలబెడుతున్న టీడీపీ, జేడీ యూను ప్రసన్నం చేసుకొనేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ పాలిత ఏపీకి ఇతోధికంగా నిధులు కేటాయించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించటమే కాకుండా, రాష్ట్రంలో పారిశ్రామి కాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులిస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకంటే బీహార్‌కు మరిన్ని తాయిలాలు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న సీఎం నితీశ్‌కుమార్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు మోదీ సర్కారు ప్రయత్నం చేసినట్టు ఆ రాష్ట్రానికి కేటాయించిన నిధులను బట్టే అర్ధమవుతున్నది. 

నాలుగు లక్ష్యాలతో బడ్జెట్

కేంద్ర బడ్జెట్‌లో ప్రధానంగా నాలుగు లక్ష్యాలను ప్రకటించారు. వేతన జీవులకు కాస్త ఊరటనిస్తూనే నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదన్న ఆందోళనల నేపథ్యంలో ఉపాధి కల్పనపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వరంగాన్ని పక్కన పెడితే ప్రైవేటు రంగంలో వచ్చే ఐదేండ్లలో 4 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు, నిరుద్యో గులకు ఉపశమనం కల్పించేందుకు కొన్ని కొత్త పథకాలు ప్రతిపాదించింది. మహిళా సాధికారతకు ప్రా ధాన్యం ఇచ్చినట్టు బడ్జెట్ గణాంకాలు చెప్తున్నాయి. 

మౌలిక వసతులకు ప్రాధాన్యం

తాజా బడ్జెట్‌లో దేశంలో వివిధ రంగాల అభివృద్ధికిగాను మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం రూ.11 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణ పేదల కోసం కొత్త విధానాలు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ సంస్కరణల్లో భాగా భూ ఆధార్‌ను ప్రవేశపెడుతామని ప్రకటించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతుండటం, పట్టణాల్లో పేదలు కూడా పెరుగుతుండటంతో వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ పేదల కోసం మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని బడ్జెట్‌లో హామీ ఇచ్చింది. అర్బన్ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేస్తామని తెలిపారు. 

రక్షణ ప్రాధాన్యం

మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ రక్షణ రంగానికి నిధులు పెంచుతూనే ఉన్నది. ఈ బడ్జెట్‌లో కూడా ఈ రంగానికి సింహభాగమే దక్కింది. దాదాపు రూ.6 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. ఆరోగ్య రంగానికి గత ఏడాదికంటే రూ.10 వేలకోట్లు బడ్జెట్ పెంచారు. 

ఆదర్శ బడ్జెట్.. కుర్చీ బడ్జెట్

ఈ బడ్జెట్ దేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిందని అధికార పక్షాలు పొగడ్తలతో ముంచెత్తగా, కుర్చీ కాపాడుకొనేందుకే రూపొందించిన బడ్జెట్ అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. వికసిత్ భారత్ లక్ష్యాలు సాధించేందుకు ఈ బడ్జెట్ బాటలు వేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ప్రధాని మోదీ తన కుర్చీని కాపాడుకోవటంలో భాగంగా మిత్ర పక్షాలను ప్రసన్నం చేసుకొనేందుకే ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఎన్డీయే యేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. 

వికసిత్ భారత్‌కు నవ లక్ష్యాలు

వికసిత్ భారత్ సాధించేందుకు మోదీ సర్కారు 

9 ప్రాథమ్యాలను ఈ బడ్జెట్‌లో నిర్దేశించింది. 

  1. వ్యవసాయంలో ఉత్పాదకత ప్రతినిరోధకత
  2. ఉపాధి నైపుణ్య కల్పన
  3. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
  4. తయారీ, సేవలు
  5. పట్టణాభివృద్ధి
  6. ఇంధన భద్రత
  7. మౌలిక సదుపాయాల కల్పన
  8. ఆవిష్కరణ, పరిశోధన అభివృద్ధి
  9. భవిష్యత్తుతరం సంస్కరణలు

భారీగా తగ్గిన బంగారం ధరలు

ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లలో 

10 గ్రాములు రూ. 3 వేల దాకా పతనం

కిలో వెండి ధర రూ. 3,500 తగ్గి 

రూ. 88,000కు చేరుకుంది.


* ఇంటర్న్‌షిప్ ద్వారా గ్రామీణులకూ పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. యువత కలలు నెరవేర్చే బడ్జెట్ ఇది. గ్రామస్థాయి నుంచి మహానగ రాల వరకు అందరినీ వ్యాపారవేత్తలను చేయటమే మా లక్ష్యం. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చబోతున్నాం. ఎంఎస్‌ఎంఈలకు రుణాలు సులభతరం చేసేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నాం.    

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

* గత పదేండ్లుగా దేశంలోని మధ్యతరగతి, పేద వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఈ బడ్జెట్‌లో మరోసారి పునరావృతమైంది. బీజేపీ చూపుతున్న ద్వేషాన్ని అరికట్టేందుకు విపక్ష ఇండియా కూటమి, కాంగ్రెస్ కార్యకర్తలంతా ఏకం కావాలి. విద్వేషాలకు వ్యతిరేకంగా దేశమంతా ఏకమవుతున్నది. ఇండియా గెలుస్తుంది. నియంతృత్వం ఓడిపోతుంది.

 సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత

* రాజకీయ పక్షపాతం చూపిం చడంతో పాటు నిరుపేదలకు వ్యతి రేకంగా రూపొందించబడిన బడ్జెట్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో పూర్తిగా మొండిచే యి చూపారు. బెంగాల్ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. కేటాయింపుల్లో రాజకీయ పక్షపాతం చూపించారు. ఎలాంటి దిశా నిర్దేశం లేని బడ్జెట్.

 మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్

* ఇది ప్రజలకు నిరాశను మిగిల్చిన బడ్జెట్. అదృష్టవశాత్తూ ఆర్థికమంత్రి ప్రకటనల తర్వాత కూడా అందరూ బతికే ఉన్నారు.

 అఖిలేశ్‌యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత. 

ఇది ముమ్మాటికీ కుర్చీ బచావో బడ్జెట్

ఇది ముమ్మాటికీ కుర్చీ బచావో బడ్జెట్. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి బడ్జెట్‌లో బీహార్, ఏపీ రాష్ట్రాలకు తాయిలాలు ఇచ్చారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలపై ఎలాంటి కేటాయింపులు లేవు. తెలంగాణ పుట్టుకను ఇష్టపడని ప్రధాని మోదీ వివక్ష కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు.. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు బీజేపీ ఎంపీలు బడ్జెట్‌పై సమాధా నం చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణిని వినిపిస్తాం.

   కడియం కావ్య, ఎంపీ, వరంగల్


ఏంజెల్ ట్యాక్స్ రద్దు.. విప్లవాత్మక నిర్ణయం

పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఎదుగుదలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడమే లక్ష్యంగా, వికసిత్ భారత్ కలను సాకారం చేసే విధంగా బడ్జెట్ ఉంది. ఉపాధి, ఎంఎస్‌ఎంఈ, నైపుణ్యాభివృద్ధి, మధ్య తరగతి రంగాలకు పెద్ద పీట వేశారు. స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టేవారికి ఏంజెల్ ట్యాక్స్ రద్దు విప్లవాత్మక నిర్ణయం. 

 సురేష్ సింఘాల్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు

సామాన్యుల బడ్జెట్

బడ్జెట్‌లో ప్రధానంగా సామాన్యు లు, యువత, రైతులపై ఫోకస్ చేశా రు. మహిళాభివృద్ధి, మౌలిక సదు పాయాల కల్పనకు ఊతమిచ్చేలా ఉంది.  ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా బడ్జెట్ రూపకల్పన చేశారు. ట్యాక్స్ కట్టేవా రికి ఉపశమనం కల్పించారు. మహి ళాభివృద్ధి పథకాలకు రూ.3లక్షల కోట్లు, వ్యవసాయరంగానికి రూ.1.52లక్షల కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 లక్షల కోట్లు కేటాయించారు.

        ఏక్‌నాథ్ షిండే, ముఖ్యమంత్రి, మహారాష్ట్ర

‘వికసిత్ భారత్’ దిశగా..

వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు కేంద్ర బడ్జెట్ దోహదం చేస్తుంది. ప్లగ్ అండ్ ప్లే విధానం ద్వారా 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు, 12 కొత్త పారిశ్రామిక వాడ ల ఏర్పాటుతో పెట్టుబడులకు ఊతం ఇవ్వడంతో పాటు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. ప్రపంచ పారి శ్రామిక రంగంలో భారతదేశాన్ని బలమైన శక్తిగా నిలబెట్టేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి.

         పెమా ఖండు, ముఖ్యమంత్రి, అరుణాచల్ ప్రదేశ్

దేశాభివృద్ధికి దోహదం

భారత దేశం నిర్దేశించుకున్న లక్ష్యా లను సాధించేందుకు కేంద్ర బడ్జెట్ ఊతమిచ్చేలా ఉంది. బడ్జెట్‌తో ద్రవ్యో ల్బణం తగ్గి దేశం మరింత ప్రకాశి స్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రం గం, ఉపాధి కల్పన, నైపుణ్యా భివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సామజిక అభి వృద్ధి, మానవ వనరుల అభివృద్ధి తదితర విభాగాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేటాయింపులు బాగున్నాయి.

  మోహన్‌యాదవ్, సీఎం, మధ్యప్రదేశ్

బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం

పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటా యించడాన్ని పూర్తిగా స్వాగతిస్తు న్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవదా యిని అయిన పోలవరం, రా్రష్ట్ర రాజ ధాని అమరావతి అభివృద్ధికి అండ గా ఉంటామని కేంద్రం బడ్జెట్ ద్వారా భరోసా ఇచ్చింది. రా్రష్ట్ర ప్రజల తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలు పుతున్నాం.

         నారా లోకేశ్, ఐటీ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశ

కేంద్ర బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యా య, కార్మికులను నిరాశ పరిచి ంది. ఉద్యోగసంఘాల ఆదాయపన్ను పరిధి స్లాబ్ పెంచాలని చేసిన డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడం అన్యా యమన్నారు. ఉద్యోగుల చెంపపై కొట్టేముందు మందురాసిన ట్లుగా ఆదాయపన్ను విధా నముంది. సీపీఎస్ ఉద్యో గుల భాగస్వామ్యాన్ని 10శాతం నుంచి 14 శాతానికి పెంచడం ఉద్యోగులను దోపిడీ చేయడమే. కేంద్రం ఉద్యోగుల పని తీరును పరిశీలించి నిర్బంధ పద వీ విరమణ చేస్తామని ప్రక టించడం దుర్మార్గం. తమకు అనుకూలంగా లేని ఉద్యోగులను తొలగించి, వారికి అనుకూల భావజాల ఉద్యోగు లను నింపడానికి కేంద్రం కుట్ర పన్నుతోంది. 

 దేవీప్రసాద్, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ 

కేంద్రానికి ధన్యవాదాలు

బడ్జెట్‌లో రాష్ట్ర రాజధాని అమ రావతికి ఆర్థికసాయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటా యించినందుకు ధన్యవాదాలు. కేం ద్రం నుంచి మేము భవిష్యత్‌లోనూ ఇలాంటి సహాయాన్నే కోరుకుంటు న్నాం. నవ్యాంధ్ర పునఃనిర్మాణానికి నిధులు కేటాయించిన దేశ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌కు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బడ్జెట్‌ను విజయ వంతంగా ప్రవేశపెట్టి రికార్డులకెక్కిన సీతారామన్‌కి శుభాకాం క్షలు. కేంద్ర ప్రభుత్వ సహాయం ఆంధ్రప్రదేశ్‌కి ఇలాగే కొనసా గాలని కోరుకుంటున్నాం.

 నారా చంద్రబాబు నాయుడు, సీఎం, ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనకు పెద్దపీట

వ్యవసాయ రంగంలో ఉత్పాదక త, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధ్ది రంగాల కు కేటాయించిన నిధులతో విప్లమా త్మక మార్పులు వస్తాయి. మౌలిక సదుపాయాల కల్పన, కొత్త పరిశో ధనలు, ఆవిష్కరణలపై ప్రధానంగా పోకస్ చేశాం. అన్నిరంగాల అభి వృద్ధికి బడ్జెట్ దోహదం చేస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోడీ నేతృత్వంలో బడ్జెట్‌ను రూపొందించారు.

నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి

‘సేవ్ మోడీ ప్రభుత్వం’ బడ్జెట్

ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కాపాడుకో వడమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొం దించారు.దేశ ప్రజల భవిష్యత్ కోసం కాకుండా తమ మిత్రపక్షాలను సంతృ ప్తి చేయడం ద్వారా తమ అధికారాన్ని నిలుపుకునేందుకు రూపొందిచిన బడ్జెట్.గత పదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మరోసా రి మొండిచేయి చూపారు.ఉద్యోగాల కల్పనకు ఎలాంటి ప్రాధా న్యత ఇవ్వలేదు.రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు ఎం ఎస్పీని పెంచుతామని హామీలిచ్చిన కేంద్రం బడ్జెట్‌లో వాటి గురించి ప్రస్తావించలేదు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం పెంచేలా ఎలాంటి కేటాయింపులు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద ప్రజల కోసం ఎలాంటి కొత్త పథకాలను ప్రవేశ పెట్టలేదు. పట్టణ, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్ప నను పూర్తిగా విస్మరించారు.

మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

కుర్చీ బచావో బడ్జెట్

ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షాలు గా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్దా నాలను నెరవేర్చడమే లక్ష్యంగా కేం ద్ర బడ్జెట్‌ను రూపొందించారు. ఇది పూర్తిగా ‘కుర్చీ బచావో బడ్జెట్’. లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌ను పూర్తిగా కాపీ చేసి తయారు చేసిన బడ్జెట్. బడ్జెట్‌లో ఎక్కువగా బూటకపు వాగ్దానాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన రాష్ట్రాలకు పెద్దపీట వేయడమంటే ఇతర రాష్ట్రాలకు మొండిచేయి చూపిం చినట్లే. ఉద్యోగాల కల్పన లేక దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే.. బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం రాజకీయ హామీలకు కేంద్ర బిందువుగా మారాయి. .

రాహుల్ గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత

ఉపాధి కల్పనలో నవశకం

2024 ఏడాదికి సంబంధిం చిన బడ్జెట్.. ఉపాధి కల్పనలో నవ శకానికి నాంది పలకనుంది. ఆర్థ్ధిక వ్యవస్థపై దేశ ప్రధాని నరేంద్రమోడీకి ఉన్న నిబద్ధత, ముందుచూపును బడ్జె ట్ ప్రతిబింబిస్తోంది. ట్యాక్స్ పేయర్స్ కు మరిన్ని సడలింపులు ఇచ్చాం. దేశ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్ దోహదప డుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ యువత, మహిళలు, రైతులకు దిశానిర్దేశం చేసే బడ్జెట్ ఇది. భారత దేశా న్ని అభివృద్ధి చెందిన దేశంగా మరల్చడంతో పాటు దేశ ప్రజల కు ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చేదిగా ఉంది.

 అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

వినతులు పెడచెవిన పెట్టారు

కేంద్రం ప్రకటించిన రూ.48.21లక్షల కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం. ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని కోరినా ఎలాంటి స్పందన లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. బడ్జెట్‌లో మెట్రో రైల్ ఫేజ్- ప్రస్తావనే లేదు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు రూ.90కోట్లు, యాంటీ నార్కోటిక్ బ్యూరోకు రూ.88 కోట్లు అడిగినా రూపాయి కూడా విదల్చలేదు. మూసీ రివర్ ఫ్రంట్ నీటి శుద్ధి కేంద్రాల స్థాపనపై కూడా ఎలాంటి ప్రస్తావన లేదు. జల్ జీవన్ మిషన్‌కు కూడా నిధులు కేటాయించలేదు. రాష్ట్ర వినతులన్నీ పెడచెవిన పెట్టారు.

  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి