calender_icon.png 27 October, 2024 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనమెత్తిన లష్కర్

22-07-2024 01:28:07 AM

బోనం.. ఆధ్యాత్మిక వైభవం

ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

వర్షంలోనూ భారీగా తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాలతోలష్కర్ శోభాయమానంగా వెలుగొందింది. సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపుతో లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు మహంకాళి బోనాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓ పక్క వర్షం కురుస్తున్నా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. మహిళలు అమ్మవారికి బోనాలు, తొట్టెలను సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దీంతో తొలి రోజు బోనాలు ప్రశాంతంగా జరిగాయి. 

పట్టు వస్త్రాలు.. బంగారు బోనం  

ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సీఎంకు ఆశీర్వచనం అందించారు. సీఎంతో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 

తరలివచ్చిన ప్రముఖులు.. 

లష్కర్ బోనాలకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు మహంకాళికి బోనం సమర్పించారు. మంత్రి సీతక్క, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, కాంగ్రెస్ నేత వీహెచ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి సహా పలువురు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. 

పోటెత్తిన భక్తులు.. 

లష్కర్ బోనాలకు భక్తులు పోటెత్తారు. దేవాదాయ శాఖ వర్షం దృష్ట్యా క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లపై కవర్లను ఏర్పాటు చేశారు. డప్పు చప్పుల్లతో జోగినీలు, శివసత్తులు బోనాలను నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తూ తరలి వచ్చారు. పోతురాజుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బోనాల సందర్భంగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. సీపీ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

నేడు రంగం.. 

లష్కర్ బోనాల జాతరలో భాగంగా నేడు(సోమవారం) ఉదయం రంగం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సం దర్భంగా మాతం గి స్వర్ణలత భవిష్యవాణి వినిపించను న్నారు. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి తీసుకువచ్చిన రూపవతి అనే అంబారి(ఏనుగు)పై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.