calender_icon.png 25 October, 2024 | 5:53 AM

70 విమానాలకు బాంబు బెదిరింపు

25-10-2024 01:58:04 AM

భారత విమానయాన సంస్థలకు కొనసాగుతున్న ఫేక్ కాల్స్

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: పక్షం రోజులుగా భారత విమానయాన సంస్థలకు నకిలీ బాంబ్ కాల్స్, మెయిల్స్ కలవరపెడుతున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వలన ప్రయాణికులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గురువారం దేశీయ, విదేశీయ భారత విమానయాన సంస్థలకు 70కిపైగా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, ఇండిగోలకు చెందిన 60 విమానాలకు, ఆకాశా ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బెదరింపు కాల్స్ వచ్చినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ఆయా విమానాల్లో బాంబ్ పెట్టినట్లు అగంతకులు సమాచారం అందించారు. అయితే అనేక ఫేక్ కాల్స్ వస్తున్నప్పటికీ అధికారులు చాన్స్ తీసుకోవద్దని విమానాల్లో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు గుర్తించలేదు. దీంతో అవన్నీ ఫేక్‌కాల్స్‌గా మరోసారి రుజువైంది. గత 11 రోజుల్లో దాదాపుగా 250 విమానాలకు బాంబు బెదిరింపు వచ్చాయి. వీటి వలన కొన్ని ఫ్లుట్లై రద్దవడంతో పాటు మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. దీంతో ఆయా విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టాలు రావడంతో పాటు ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.