calender_icon.png 23 October, 2024 | 5:59 AM

విమానయానంపై ‘బాంబు’

23-10-2024 01:48:05 AM

వరుస బెదిరింపులతో ప్రయాణికుల్లో బెంబేలు

ఆర్థికంగా నష్టపోతున్న విమానయాన సంస్థలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: భారత విమానయాన రంగాన్ని బూటకపు బాంబు బెదింపు సందేశాలు వేధిస్తునాయి. గడిచిన 10 రోజుల్లోనే సుమారు 100కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు అందాయి. తాజాగా మంగళవారం కూడా 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు.

బాంబు బెదిరింపు సందేశాల నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికుల సెక్యూరిటీ విషయంలో అవరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆ చర్యలు ప్రయాణికుల్లో తమ ప్రాణాల పట్ల భరోసాను కలిగించలేకపోతున్నాయి. వరుస బాంబు బెదిరింపు సందేశాలతో విమాన ప్రయాణాలంటేనే ప్రయాణికులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా జంకుతున్నారు.

దీంతో విమాయాన సంస్థలు  ఆర్థికంగా నష్టపోతున్నాయి. విమానాలు టేకాఫ్ అయిన తర్వాత బెదిరింపు సందేశాలు వస్తుండటంతో ఫైలెట్లు విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేయడం లేదా దగ్గర్లోని ఇతర విమానాశ్రయాల వైపు దారి మల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చాలా విమాన సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. 

ముందుగా వాళ్ల టార్గెట్ స్కూళ్లే

ప్రస్తుతం బూటకపు బాంబు బెదింపు సందేశాలతో ప్రయాణికులను భయాందోళనలకు గురి చేస్తున్న కేటుగాళ్లు మొట్టమొ దటగా పాఠశాలలను టార్గెట్ చేశారు. మే, జూన్ నెలల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఫేక్ బాంబు మెసేజ్‌లను పంపారు. పాఠశాలల ప్రాంగణాల్లో, తరగతి గదుల్లో బాంబులు పెట్టినట్టుగా సందేశాలు పంపించి అధికారులను పరుగులు పెట్టించారు. తర్వాత సైబర్ నేరగాళ్లు  విమానాలవైపు దృష్టి మళ్లించారు.

పోలీసుల చేతికి 

ఎందుకు చిక్కడం లేదంటే

 బూటకపు బాంబు బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయాందో ళనలకు గురి చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఇప్పటివరకూ కనీసం వాళ్లు ఎక్కడ నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారో కూడా అధికారులు కనిపెట్టలేకపోయారు. దీనికి ప్రధాన కారణం కేటుగాళ్లు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవడమే. గతంలో సైబర్ నేరగాళ్లు ఇటువంటి బాంబు బెదిరింపు సందేశాలు  కాల్స్ ద్వారా లేదా మెయిల్స్ ద్వారా నేరుగా అధికారులకు పంపించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగుతున్నారు.  

ఒక్కరు మాత్రమే అరెస్ట్

ఫేక్ బాంబు బెదిరింపులతో సైబర్ నేరగాళ్లు విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ వాళ్లను పట్టుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ అరెస్టులు జరగకపోవడమే దీనికి నిదర్శనం.   ఒక్క బాలుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై దర్యాప్తునకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ ఏజెన్సీస్ వంటి దేశంలోని ప్రధాన సంస్థలతోపాటు పలు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులతో టీంను ఏర్పాటు చేసింది. సోమవారం ఈ బృందం ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ సినియర్ అధికారి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ‘జామ్తారా ఆఫ్ ఇండియన్ ఏవిషయన్’గా అభివర్ణించారు.  

24 గంటల్లో 79 బెదిరింపులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: గడిచిన 24 గంటల్లో 79 విమానాలకు బాం బు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు 23 ఇండిగో, 21 విస్తారా, 12 అకాసా, 23 ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులతో బూటకపు సందేశాలు అందాయి. దీంతో వారం వ్యవధిలోనే వచ్చిన బెదిరింపుల సంఖ్య 169కి చేరింది.