అత్యవసర తనిఖీలు చేపట్టిన అధికారులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత్‌లోని వివిధ విమాన సంస్థలకు తరుచూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. కాగా ఆదివారం ఒక్కరోజే విస్తారా, ఆకాశ ఎయిర్‌తో పాటు అనేక సంస్థలకు చెందిన 32 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు అత్యవసర తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విస్తారా ఎరోప్లేన్‌ను ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించారు.
అక్కడే తనిఖీలు నిర్వహించిన తర్వాత తిరిగి లండన్‌కు పంపారు. తమ గమ్యస్థానాలకు చేరిన విమానాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఎయిరిండియా, ఇండి గో, ఆకాశ్‌ఎయిర్, విస్తారా, స్పైస్‌జెట్, స్టార్‌ఎయిర్, అలయన్స్ ఎయిర్‌లకు చెందిన కొన్ని విమానాలకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకొనే దిశగా పౌర విమానయానశాఖ కూడా సన్నద్ధమైంది. ఈ వ్యవహారంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇప్పటికే ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో లిస్ట్‌లో చేర్చాలని చూస్తోంది.