calender_icon.png 16 October, 2024 | 5:58 PM

ఏడు విమానాలకు బాంబు బెదిరింపు

16-10-2024 03:48:51 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తున్న భారత విమానాలు మంగళవారం బాంబు బెదిరింపులతో బెంబేలెత్తిపోయాయి. ఒకేరోజు ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పలు విమానాలను అత్యవసరంగా దించేశారు. చివరకు బాంబు బెదిరింపు లన్నీ ఉత్తవేనని తేలటంతో ఊపిరి పీల్చుకొన్నారు.

ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం, జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, డామన్ ఇండిగో విమానం, దర్బంగా స్పైస్‌జెట్, సిలిగురి ఆకాశ ఎయిర్ విమా నం, అమృత్‌సర్ అలయన్స్ ఎయిర్, మధురై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిలో నాలుగు విమానాలకు ఓ ఎక్స్ ఖాతా ద్వారా దుండగులు బెదిరింపు సందేశాలు పంపారు.

వీటితోపాటు సౌదీ అరేబియా నుంచి వస్తున్న ఇండిగో ఫ్లుటైకు కూడా బెదిరింపు సందేశం రావటంతో జైపూర్‌లో అత్యవసరంగా దించారు. ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగోకు వెళ్తున్న విమానాన్ని ముందు జాగ్రత్తగా కెనడాకు మళ్లించి దించేశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.