29-04-2025 12:34:12 AM
చర్ల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలు, దుర్గం గుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా కూం బింగ్ నిర్వహిస్తున్నాయి. గత ఏడు రోజులుగా జరుగుతున్న ఆ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలు ఇప్పటి వరకు మావోయిస్టులు స్థావరాలుగా ఉపయోగించుకున్న నాలుగు గుహలను గుర్తించి, వాటిలో సోదాలు నిర్వ హించాయి.
అయితే, మావోయిస్టుల ఆచూకీ లభ్యం కాలేదు. దుర్గం గుట్టల ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు బీర్ బాటిల్స్ కనిపించాయి. వాటిని బాంబు స్కాడ్ బృం దాలు తనిఖీ చేయగా భూమి పొరల్లో పొడవాటి వైరుతో అమర్చిన ఐఈడీలు పెద్దమొత్తంలో బయటపడ్డాయి. వాటిని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దండకారణ్యంలో మావోయిస్టులు అ మర్చిన 150 కంటే ఎక్కువ ఐఈడీలను అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీ ర్యం చేశారు.
కొనసాగనున్న ఆపరేషన్..
గత వారం రోజులుగా ఆపరేషన్‌లో పా ల్గొన్న జవాన్లను ఉన్నతాధికారులు వెనక్కి పిలుస్తున్నారు. ఇదే సమయంలో వారి స్థానంలో కొత్త బృందాలను ఆపరేషన్‌లో చేర్చుతున్నారు. దీని వల్ల మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ మరికొంతకా లం ఇదే ఉధృతితో కొనసాగుతుందన్న విష యం అర్థమవుతుంది.
హిడ్మానే లక్ష్యం..
మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ హెడ్మానే లక్ష్యంగా భద్రతా దళాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా కర్రెగుట్టలపై దర్శనమిస్తున్న ఏ ఒక్క గుహను వదలకుండా భద్రతా బలగాలు క్షణ్ణంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్‌ల సహాయాన్ని కూ డా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు బాంబుల శబ్దం వినిపించిందని కర్రెగుట్ట పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
మహిళా మావోయిస్టుల గుర్తింపు
ఈ నెల 24న కర్రెగుట్టలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ముగ్గురు మహిళా మావోయిస్టులను అధికారులు గుర్తించారు. మరణించిన ముగ్గురు మహిళా మావోయిస్టులు పీఎల్‌జీఏ బెటాలియన్ సభ్యులుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా కాల్పుల్లో హుంగి, సింటు, శాంతిలు మరణించినట్టు స్పష్టం చేశారు. ఒక్క్కొక్కరిపై రూ.8లక్షల చొప్పున ఈ ముగ్గురు తలలపై మొత్తం రూ.24లక్షల రివార్డు ఉన్నట్టు వెల్లడించారు.
లొంగిపోయిన 24 మంది మావోయిస్టులు
బీజాపూర్ జిల్లా బస్తర్ పరిధిలో 24 మంది మావోయిస్టులు వెస్ట్ బస్తర్ డివిజన్ బహిరంగడ్ ఏరియా కమిటీ వెస్ట్ బస్తర్ డివిజన్ బహిరంగడ్ ఏరియా కమిటీ పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపో యిన వారిలో రూ.14.50లక్షల రివార్డును కలిగిన 14 మంది మావోయిస్టులు కూడా ఉన్నారు. అధికారుల ఎదుట లొంగిపోయిన వారిలో సుద్రు హేమ్లా అలియాస్ రాజేశ్, కమలి మొరీయం అలియాస్ ఊర్మిళ, జయమోతి పన్యో తదితరులు ఉన్నారు.
వీరంద రికీ పునరావాసం పథకం కింద అధికారులు రూ.50వేలను ప్రోత్సాహకంగా అందించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 203 మంది మావోయిస్టులు అధికారుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో దాదాపు 90 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. కాగా, పునరావాస పథకాన్ని సద్వినియోగం చేసుకుని మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోలీసు ఉన్నతాధికా రులు సూచిస్తున్నారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయండి
ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని, ప్రభుత్వం తమతో షరతులులేని శాంతి చర్చలు జరిపి, సమస్యను సంయుక్తంగా పరిష్కరించుకోవాలని కోరుతూ సోమవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరు మీదుగా లేఖను విడుదల చేసింది. దేశంలో ఉన్నది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమని, కానీ రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్ట ప్రాంతంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి 10 వేల మంది భద్రతాదళాలను మోహరించి ముగ్గురు మావోయిస్టులను హతమార్చారని లేఖలో పేర్కొన్నా రు. అంతేకాకుండా తమ పార్టీ అధినాయకత్వాన్ని కూడా హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతి చర్చలకు అనుకూల వాతావరణం కల్పించి, ఈ మారణకాండను అరికట్టాలని కోరారు.
ఛతీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించేలా కృషి చేయాలని ప్రజాస్వామ్య ప్రేమికులు, జర్నలిస్టులు, శాంతి ఉద్యమకారులు, అణగారిన వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
శాంతి చర్చలకు సిద్ధమంటూ తాము ఇప్పటి వరకు మూడు లేఖలు విడుదల చేసినా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన జీవించే హక్కును తుంగలో తొక్కుతున్నారని లేఖలో విమర్శించారు.