09-03-2025 12:00:00 AM
సిమి గరేవాల్.. 1970లో ఓ సెన్సేషన్. సినీ నటి మాత్రమే కాకుండా దర్శకురాలు, నిర్మాత, హోస్ట్ కూడా. ‘ది లేడీ ఇన్ వైట్’ అని ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఎందుకంటే ఆమెకు శ్వేత వర్ణమంటే అమితమైన ఇష్టం. హోస్టింగ్ అయినా.. సినిమా ఈవెంట్ అయినా తెలుపు రంగు దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించేది.
నాజూకైన మేని.. అంతకు మించి తీయని స్వరం.. బ్రిటీష్ యాక్సెంట్ ఇంగ్లిష్‌తో చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆ రోజుల్లోనే బోల్డ్‌గా కనిపించింది. తన టాక్ షోలో జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీల జీవిత కథలను వినిపిస్తూ బ్యూటీ విత్ బ్రెయిన్ అని నిరూపించుకుంది.
సిమి 1940లో లూథియానాలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. కాని ఆమె పెరిగిందంతా ఇంగ్లాండ్‌లోనే. సిమి గరేవాల్ తండ్రి బ్రిగేడియర్ జేఎస్ గరేవాల్ భారత సైన్యంలో పని చేశారు. 1962లో ఆంగ్ల భాషా చిత్రం ‘టార్జాన్ గోస్ టు ఇండియా’ చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించింది.
ఈ సినిమా తర్వాత తన మకాంను భారత్‌కు మార్చేసింది. ఆ తరువాత ఆమె ‘దో బదన్ (1966), మేరే నామ్ జోకర్ (1970), అరణ్‌యేర్ దిన్ రాత్రి (1970), సత్యజిత్ రే, పడతిక్ (1973)లో వంటి చిత్రాల్లో నటించింది. ఆమెకు ‘కభీ కభీ, చల్తే చల్తే’ చిత్రాలు లైఫ్ ఇచ్చాయి. 1980 ప్రారంభంలో సిమి దర్శకత్వం, నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. సిగా ఆర్ట్స్ అనే ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించింది.
సిమీతో బంధానికి..
సిమికు ప్రేమ, పెళ్లి అనేవి ఎందుకోగానీ అస్సలు కలిసి రాలేదు. ముగ్గురితో ప్రేమాయణం సాగించినా.. ఒక్కరితోనూ పెళ్లి పీటలెక్కలేదు. పెళ్లి పీటలెక్కిన వ్యక్తితోనూ జీవితాన్ని ఎంతోకాలం కొనసాగించలేదు. 17 ఏళ్లకే ఇంగ్లాండ్ మహారాజుతో ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. కానీ అతని వల్లే తనకు బయటి ప్రపంచం తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మూడేళ్లు వీళ్ల ప్రేమ బ్రేకప్‌తో ముగిసింది.
ఆ తరువాత సిమీ గరేవాల్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఒక పార్టీలో క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీతో పరిచయం ఏర్పడింది. ఎక్కడ మ్యాచ్ ఉన్నా వీరిద్దరూ కలిసే వెళ్లేవారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. ఆ తరువాత 1970లో ఢిల్లీకి చెందిన రవి మోహన్‌ను సిమి వివాహం చేసుకుంది. పదేళ్ల తర్వాత వీరిద్దరూ తమ వివాహ జీవితానికి స్వస్తి పలికారు.
ఆ తరువాత రతన్ టాటాతో సిమి గరేవాల్ ప్రేమలో పడింది. ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్టు ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ తరువాత విడిపోయి స్నేహితుల్లా మెలుగుతున్నట్టు గతంలో ఓ సందర్భంలో తెలిపింది. రతన్ టాటా మరణ సమయంలోనూ ఆమె పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు..
ఈ బ్యూటీ ఎంతోమందితో ప్రేమలో పడినా.. ఆ బంధం ఎక్కువగా కొనసాగించ లేకపోయింది. ఆమె రీల్ లైఫ్ ఉన్నంత అద్భుతంగా రియల్ లైఫ్ లేదనే చెప్పాలి. అయినా సరే.. ఆటుపోట్లకు భయపడకుండా జీవితాన్ని సాగిస్తోంది.