*ఆలియా ఫక్రీని అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు
న్యూయార్క్, డిసెంబర్ 3: బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి ఆలియా ఫక్రీని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసులో ఆలియా ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఆలియా తన మాజీ బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని సజీవదహనం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.
పోలీసుల వివరాల ప్రకారం న్యూయార్క్‌లో ఉంటున్న ఆలియా ఫక్రీ కొంతకాలం పాటు ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ఆలియాతో బ్రేకప్ అయిన తర్వాత ఎడ్వర్డ్ మరో యువతికి దగ్గరయ్యాడు. ఈ విషయం తెలిసి ఆలియా పలుమార్లు అతడిని బెదిరించింది. ఈ క్రమంలోనే నవంబర్ 26న ఎడ్వర్డ్, అతడి స్నేహితురాలు ఉంటున్న భవనం వద్దకు వెళ్లింది.
ఈ రోజు మీరందరూ చావబోతున్నారని కేకలు వేస్తూ వాళ్లు ఉంటున్న ఇంటికి నిప్పంటించింది. ఎడ్వర్డ్, అతడి స్నేహితురాలు మరణించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
ఈ కేసులో ఆలియా దోషిగా తేలితే ఆమెకు జీవతఖైదు పడే అవకాశాలు ఉన్నాయి. ఎడ్వర్డ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారని అతడి తల్లి జానెట్ జాకోబ్ పేర్కొన్నారు. తన కుమారుడు ఏడాది క్రితం ఆలియాకు బ్రేకప్ చెప్పినట్టు వెల్లడించారు.