- ముగ్గురు ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్రగాయాలు
- లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
- ఎన్‌హెచ్ 65పై అయిటిపాముల వద్ద ఘటన
నల్లగొండ, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి) : ముందు వెళ్తున్నలారీకి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రెండు బెలెరోలు సహా ఒకదానినొకటి ఢీకొని ముగ్గురు ఆర్టీసీ తనిఖీ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. కట్టంగూరు మండలం అయిటిపాముల శివారులో ఎన్హెచ్-65పై ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
సూర్యాపేట ఆర్టీసీ డిపోకు చెందిన తనిఖీ అధికారులు బీరం ఉపేందర్రెడ్డి, గరిణేపల్లి నర్సింహారావు, వడ్డెరబోయిన వెంకటేశ్వర్లు విధుల్లో భాగంగా ఉదయం ఆర్టీసీ వాహనం (బొలెరో)లో నల్లగొండకు బయల్దేరారు. అయిటిపాముల శివారుకు రాగానే ముందు వెళ్తున్న లారీకి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.
దీంతో వెనుక నుంచి వస్తున్న ప్రభుత్వ వాహనం (బొలెరో) ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన బొలెరోను మరో ట్రాలీ బొలెరో ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయి అందులోని ఆర్టీసీ అధికారులకు తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. టికెట్ కలెక్టర్ శేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కట్టంగూరు పోలీసులు తెలిపారు.