- బొగ్గు గనుల పుట్టినింట రైలు కూత పెట్టదాయే..
- వందేళ్ల చరిత్ర కనుమరుగాయే..
ఇల్లెందు, డిసెంబర్ 3: బొగ్గు గనులకు పుట్టినిల్లు ఇల్లెందు. బొగ్గుట్టగా పేరున్న ఈ పట్టణ శివారులోనే వందేళ్ల క్రితం బ్రిటీష్ పాలకులు బొగ్గు గనులను గుర్తించారు. ఇక్క డి రైల్లేస్టేషన్ నుంచి దశాబ్దాల పాటు బొగ్గు రవాణా జరిగేది. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల కోసం ప్యాసింజెర్ రైళ్లు సైతం నడిచేవి. ఇల్లెందు నుంచి ప్రయాణికులు కొత్తగూడెం (భద్రాచలం రోడ్), గాంధీపురం, కారేపల్లి ప్రాంతాలకు సునా యా సంగా వెళ్లేవారు.కాలక్రమేణా ఈప్రాంతంలో బొగ్గు రవాణా తగ్గిపోవడంతో రైల్వే స్టేషన్ మూతపడింది.
ప్రస్తుతం రైల్వేస్టేషన్ ప్రాంతం చిట్టడవిని తలపిస్తున్నది. కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. రైల్వే ట్రాక్‌లపై పిచ్చి మొక్కలు పెరిగి ట్రాక్ ఎందుకూ పనికి రాకుండా తయారయ్యాయి. నిత్య వందలాది మంది సింగరేణి కార్మికులు, ప్రయా ణికులతో కళకళలాడిన రైల్వేస్టేషన్ ఇప్పుడు చిన్నబోయి దర్శనమిస్తున్నది.
చరిత ఇది..
ఇల్లెందు ప్రాంతంలో వందేళ్ల క్రితమే ఆంగ్లేయులు బొగ్గు గనులను గుర్తించారు. బొగ్గు రవాణా చేసేందుకు 1928లో పట్టణంలో సింగరేణి కాలరీస్ రైల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చింది. బ్రిటీష్ అధికారులు ఇక్కడి నుంచి ఏటా లక్షలాది టన్నుల బొగ్గు రవాణా చేసేవారు. అలాగే ప్రయాణికుల కోసం మొదట్లో రెండు బోగీలతో ప్రతిరోజు ప్యాసింజెర్ రైళ్లు నడిచేవి. ప్రయాణికుల రద్దీ పెరగడంతో అధికారులు క్రమంగా బోగీలు పెంచుకుంటూ వెళ్లారు.
సింగరేణి అధికారులు, కార్మికులు ఏదో ఒక అవసరాలపై గోదావరిఖని, మందమర్రి, వరంగల్, రామగుండ, భూపాలపల్లి ఏరియాలకు వెళ్లేవారు. 2006 వరకు రెండు బోగీల ప్యాసింజెర్ రైళ్లు నడిచాయి. తర్వాత ఆ సేవలు కూడా నిలిచిపోయాయి. 2015 లో రైల్వేస్టేషన్ పూర్తిగా మూతపడింది. భవనాల్లోని గదుల తాళాలు పగులగొట్టి దుండగులు విలువైన కలప, ఇనుప సామగ్రి అపహరించారు. వందేళ్ల చరిత్ర ఉన్న రైల్వేస్టేషన్‌ను రైల్వేశాఖ తిరిగి ప్రారంభించాలని, ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.