calender_icon.png 8 October, 2024 | 8:27 PM

చెత్తశుద్ది లేని బోడుప్పల్

08-10-2024 05:53:54 PM

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పడకేసిన పారిశుద్ధ్యం..

అధికారుల పర్యవేక్షణ లోపంతో కంపుకొడుతున్న నగరం....

చెత్త శుద్ధిపై చేతులెత్తేసిన ప్రజా ప్రతినిధులు....

పారిశుద్యం పై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజల డిమాండ్..

మేడిపల్లి, (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎటు చూసిన చేత్తే...అధికారుల అలసత్వం నగర ప్రజల పాలిట శాపంగా మారింది. చెత్త సేకరణలో నిర్లక్ష్యం రహదారులు, వీధులలో చెత్త పేరుకుపోవడం అపారిశుధ్యానికి నిలయంగా మారడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధుల పాలన గాడి తప్పడం మున్సిపల్ అధికారులు పారిశుధ్య నిర్వహణలోపం వెరిసి ప్రధాన రహదారి సైతం డంపింగ్ యార్డ్ ను తలపిస్తుంది.  “స్వచ్ఛ బోడుప్పల్” అంటూ హంగు ఆర్బాటాలతో కార్యక్రమాలు చేపట్టడం తప్ప ఆచరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్లపై చెత్త వేస్తే  జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తూ పెట్టిన సూచిక బోర్డులు కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఉన్నాయని ప్రధాన రహదారులపైనే పారిశుధ్యంపై పర్యవేక్షణ లోపించడం రహదారికి ఇరువైపుల పేరుకుపోయిన చెత్త వద్ద కుక్కలు, పందులు వల్ల పాదచారులు, వాహన దారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయని, వీటికి తోడు ఆ చెత్త నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి రోడ్లపై చెత్త వేస్తున్న  వారిని గుర్తించి జరిమాన విధించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.