calender_icon.png 5 November, 2024 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరు దాటాక బోడి మల్లన్నా?

05-11-2024 02:13:23 AM

  1. ఎన్నికల్లో గెలిచేందుకే హామీలా? అధికారం వస్తే పక్కన పెట్టేస్తారా?
  2. సోనియా, రాహూల్ గాంధీ హామీలు, డిక్లరేషన్లు ఏమైనయి ?
  3. కాంగ్రెస్ హామీల అమలు తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
  4. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ‘ఏరు దాటే దాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అటకెక్కించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే హామీలు పక్కన పెట్టాయని, సంక్షేమ పథకాల అమలులో సైతం విఫలమయ్యాయని దుయ్యబట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 300 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ కరెంటు అన్నారని, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యమని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య భార్యే అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల సంగతి మరచిపోయిందని విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీల సంగతేమైందని ప్రశ్నించారు.

డిక్లరేషన్లు, గ్యారెంటీల, మేనిఫెస్టోలన్నీ వట్టి బూటకమని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తికావొస్తుందని, ఎన్నికల హామీలను ఎప్పటిలోపు అమలు చేస్తారనే విషయంపై ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని యువత ప్రశ్నిస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో కుళ్లబొడుస్తున్నారని మండిపడ్డారు.

రెండు ప్రభుత్వాలు దొందూ దొందే..

మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను పదేళ్లు పాలించి బీఆర్‌ఎస్ ప్రభు త్వం నిండా ముంచిందని కేంద్ర మంత్రి అన్నారు. ఏకంగా రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులపాలు మిగిల్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూర్తి కాకముందే రూ.లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు. ఈ విషయంలో దొందూ దొందేనని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో కేవలం అప్పుల మొబిలైజేషన్ కోస మే ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం రైతులను అలాగే మోసం చేసిందన్నారు. కేంద్రం చివరి ధాన్యపు గింజ వరకు కొనేందుకు సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సరైన సహకారం లేదని స్పష్టంచేశారు.

నాడు 17 పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇప్పుడు సన్నధాన్యానికి మా త్రమే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ శనిలా తయారైందని మండిపడ్డారు. సంగెం బీబీనగర్ వరకు ఈ నెల 8న సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు.