13-04-2025 01:27:22 AM
‘మహమ్మదీయయుగానికి ముందు పరిఢవిల్లిన నగరం బోధన్. 20అ. 6అ. 6అ. కొలతల రాళ్ళతో కట్టిన ఎత్తున గోడలతో బోధన్ కోట వుంది. నలువైపుల నాలుగు ద్వారాలున్నాయి. నగరమంతా చెల్లాచెదురుగా పడివున్న జైన (బుద్ధ), హిందూ విగ్రహాలు కనిపిస్తాయి. బోధన్‌లో 6 అ.ల ఎత్తున జైనశిల్పం ముక్కలుగా పడివుంది. ప్రజలు ఆ శిల్పాన్ని తీసివేయడానికి నిరాకరించారు. దానిని పూజిస్తున్నారు.
దేవల్ మసీదుగా పిలువబడుతున్న ప్రస్తుత మసీదు పూర్వం జైనాలయమైవుంటుంది. గుడిలోని అనేకచోట్ల తీర్థంకరుల శిల్పాలు చెక్కివున్నాయి. తర్వాత కాలంలో హిందువుల చేతిలో హిందూశిల్పాలు పెట్టబడ్డాయి. నరసింహస్వామి శిల్పాలు నలుమూలల్లో ఉన్నయి. దేవాలయం ఆర్కిటెక్చర్ 8-10 శ.ల శైలిలో వుంది. నక్షత్రాకార ప్రణాళికతో కట్టబడింది. ఎత్తు తక్కువ స్తంభాలతో, సాదాసీదా చెక్కడాలతో వుంది. మహమ్మదీయులు ఆక్రమించుకున్నాక మసీదుగా మార్చారు.
నిర్మితిలో మార్పు చేయలేదు కానీ, పడుమటివైపు రాళ్ళతో ఒక మిహ్రాబ్ (ప్రార్థన-గూడు), దానికి ఉత్తరాన ఒక మిన్బార్ (పల్పిట్) ఒక చిన్న వేదిక కట్టబడ్డది. గుడికప్పుపైన మసీదువలె కనిపించడానికి ఇటుకలతో 12 డోమ్స్ కట్టబడ్డాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325-1351) దీనిని మసీదుగా మార్పించాడు.”-గులాం యాజ్దాని (Annual Report of the Arch. Dept. of HH the Nizam’s Dominions-
తుగ్లక్ ఖలీఫా ఆదేశంతో తాను ఈ ఆలయాన్ని మసీదుగా మారుస్తున్నానని, గుడిపై డోమ్స్, ఈద్గా, తోట, కుద్భా పఠనానికి ఒక టవర్ ని కట్టించి, ఇది అల్లా ఆజ్ఞగా భావిస్తున్నానని ఒక శాసనంలో చెక్కించాడు. వందస్తంభాల గుడి, ఇంద్రనారాయణ దేవాలయంగా పిలువబడే ఈ గుడికి ఎక్కడాలేనివిధంగా దేవల్ మసీదు అనే పేరుంది. ముస్లింలు మసీదుగా, హిందువులు నరసింహస్వామి గుడిగా, జైనులు జినాలయంగా చెప్తున్నారు. మూడు ధర్మాల మాటను నిజం చేస్తున్నది ఈ గుడి.
తొలుత జినాలయం. రాష్ట్రకూటప్రభువు ఇంద్రవల్లభుడు తన పేరుతో ‘ఇంద్రనారాయణ’మనే జినాలయాన్ని కట్టించాడు. (8వ శ.) జైనధర్మమతావలంబకులైన పాలకులు, అధికారులు జైనమతగ్రంథం ‘త్రిషష్టిపురుష శలాక’లో పేర్కొన్న 63మంది మహాపురుషుల పేర్లను ధరించినవారున్నారు. రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షునికి ‘వీరనారాయణుడని’, శంకరగండరసకు ‘విద్విష్ట నారాయణుడని’, ఇంద్రవల్లభునికి ‘ఇంద్రనారాయణుడని’ నామాంతరాలున్నాయి. అట్లా ఈ జినాలయానికి ఇంద్రనారాయణాలయమని పేరు.
ఇతని తర్వాత కాలంలో బోధన్ పాలించినవారు బోధన చాళుక్యులుగా వారే వేములవాడలో రాజధాని నిర్మించుకున్నంక ‘వేములవాడ చాళుక్యులు’గా పిలువబడ్డారు. కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్లదేవుని ప్రెగ్గడ జోగపయ్య రాష్ట్రకూట ప్రభువు చక్రేశ్వర ఇంద్రవల్లభుడు తన రాజధాని పోదన (బోధన్)లో ఇంద్రనారాయణ జినాలయాన్ని నిర్మింపజేసాడు. శిథిలమైన ఆ గుడిలో ప్రెగ్గడ జోగపయ్య విష్ణువును ప్రతిష్టించి, గరుడస్తంభమెత్తించినట్లు, ఆ దేవాలయానికి తాళవ్రిత్తి, గీత,వాద్య, నృత్తభోగాలు, సర్వబాధాపరిహారంగా 90 మర్తురుల భూమి, నివేశనస్థలం, బ్రహ్మపురి దగ్గర 60 మర్తురుల భూమిని దానాలుగా ఇచ్చినట్లు నిజామాబాద్ జిల్లా శాసనసంపుటిలో 8వ శాసనంలో వివరించబడ్డది. అందువల్లనే ఆలయమంటపంలో స్తంభాలు రెండుకాలాలవి, రెండు శైలులలో వున్నాయి. రాష్ట్రకూట, చాళుక్యుల కాలపు స్తంభాలవి. రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన జినాలయానికి బోధన్ చాళుక్యులు మార్పులు, చేర్పులు చేసివుంటారనిపిస్తున్నది.
మరొక బోధన్ శాసనంలో అదే జోగపయ్య జైనబసదికి కొంతభూమిని దానం చేసినట్లుంది. గుడిస్తంభాలలో ఒకదానిపై ‘జినుడు వర్ధమహావీరుని’ అర్థశిల్పమున్నది. జినాలయాలలో సర్వసాధారణంగా కనిపించే ‘శంఖలతాతోరణం’ ఆలయద్వారం ముందర వున్నది. అర్ధమంటపం శైలిలో కక్ష్యాసనాలు, వాటికి చతుర్దళ పుష్పాలు చెక్కివున్నాయి. బయటపారేసివున్న ద్వార శాఖమీద చేతులువిరిగిన ద్వారపాలకుడు ఎవరో తెలియడం లేదు. చామరధారిణి వున్నది. దానిపై లతలు, పుష్పాలు, సింహతోరణం కనిపించాయి. దాదాపు 2,3 ఎకరాలలో విస్తరించిన దేవాలయ ప్రాంగణానికి కట్టిన ప్రహరీ రెండడుగుల వెడల్పు, మూడడుగుల మందం, పదడుగుల పొడవున్న రాళ్లతో నిర్మించబడ్డది.