calender_icon.png 22 November, 2024 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడ కాకర అదరహో

22-07-2024 03:11:23 AM

  • పట్టణాల్లో చికెన్ వెజిటెబుల్‌గా పేరు

అడవి ఆహారం.. పోషకాల సమాహారం

బోడకాకర కాయలపై భలే క్రేజీ

జయశంకర్ భూపాలపల్లి, జూలై ౨౧(విజయక్రాంతి):  రుచికి చేదైనా ఆరోగ్య విలువలకు చిరునామా కాకర. అయితే అలాంటి పెరటి కాకరనే మించి పోషకాలున్న కూరగాయ మరోటి ఉంది.. అదే బోడ కాకర. చూడ్డానికే కాదు.. తినడానికి ముద్దచ్చేలా ఉంటుంది. అడవిలో ఇవి సహజ సిద్దంగా లభిస్తాయి. అడవిలో లభ్యమయ్యే కాకర చిన్నగా పొట్టిగా ఉంటుందని లైట్‌గా తీసుకుంటే పొరపాటే... బోడకాకరను టచ్ చేస్తే దాని టేస్టే సాలీడ్ అని చెప్పచ్చు.

అడవుల్లో లభ్యమయ్యే పండ్లు, కాయలు ఏవైనా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తుంటారు. అలాంటి కోవకు చెందినదే ఈ బోడకాకరకాయ. వర్షాకాల సీజన్‌లో లభ్యమయ్యే ఈ బోడకాకరలు గిరిజనులకు సీజనల్ ఉపాధి నిస్తాయి. అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ఈ బోడకాకరకు పల్లెలు, పట్టణ వాసులు ఎంతో ఇష్టపడుతుంటారు. వీటిని చికెన్ వెజిటేబుల్ అని కూడా పేరుపెట్టారు.

అడవుల్లో లభ్యం

అడవుల్లో బోడకాకర మొక్కలు గడ్డల రూపంలో భూమిలోపల ఉండి వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే వేర్ల నుంచి పిలకలు పుట్టి ఏపుగా పెరుగుతాయి. జూలై మొదటి వారంలోనే పూత కాతకు వచ్చి చివరి వారం నుంచి కాస్తూనే ఉంటాయి. ఈ సారి వర్షాకాలం తొలకరి జల్లులు జూన్ చివరి వారంలో రావడంతో జూలై రెండో వారంలోనే మార్కెట్‌లో కనబడుతున్నాయి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ బోడకాకర కొనేందుకు ఎవరు వెనుకడుగు వేయరు. బోడకాకర కాయలు రుచిగా ఉండటమే కాకుండా అటవీ ప్రాంతంలో సహజ సిద్దంగా లభిస్తుండటంతో చాలా మంది వీటిని కొనేందుకు ఎగబడుతుంటారు. 

గిరిజనులకు సీజనల్ ఉపాధి 

అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన బోడకాకర గిరిజనులకు సీజనల్ ఉపాధినిస్తుంది. జయశం కర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అడవులు విస్తరించి ఉండటంతో బోడకాకర విరివిగా లభిస్తుంటాయి. గిరిజనులు ఉదయాన్నే అడవికి వెళ్లి సాయంత్రం వరకు బోడకాకర కాయలను సేకరిస్తారు. ఆయా గ్రామాల శివారు అడవుల్లో ఎలాంటి పెట్టుబడులు లేకుండా లభించే ఈ బోడకాకర కాయలను సేకరించి గిరిజనులు ఉపాధి పొందుతుంటారు. ఎక్కువగా జయశంకర్ భూపాలపలల్లి జిల్లా మహాముత్తారం, కాటారం, మల్హర్, మహాదేవ్‌పూర్, పలిమెల ములుగు జిల్లా  తాడ్వాయి, వాజేడు, వెంకటాపూర్ (వి) వెంకటాపూర్ (ము) ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట మండల్లాల్లోని గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు సమీపంలోని అటవీ ప్రాంతంలో బోడకాకరలను సేకరించి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. 

కిలో రూ.300 సుంచి రూ.400

గిరిజనులు అటవీప్రాంతంలో సేకరించిన బోడకాకరలు పట్టణాల్లో భలే డిమాండ్ ఉంటుంది. సీజన్ ప్రారంభమైన మొదటి రోజుల్లో బోడకాకరలు కిలో రూ.300ల నుంచి రూ. 400లకు పలుకుతాయి. గ్రామాల్లో గిరిజనులు రూ.150నుంచి రూ.200లకు వ్యాపారులకు అమ్మితే వాళ్లు రెట్టింపు ధరకు అమ్ముతుంటారు. ఈ సీజన్‌లో ఒక్కసారైన బోడకాకర తినాలని ప్రతి ఒక్కరు ఆశపడ్తారు. ఈ క్రమంలో నెలరోజుల పాటు బోడకాకరలకు భలే డిమాండ్ ఉంటుంది. ఎంత రేటు ఉన్నా ఒక్కసారైనా కొనుగోలు చేయని వారు ఉండరు. వర్షాకాల సీజన్‌లో బోడలను తప్పకుండా తినాలని, అడవిబోడలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్ముతారు. ఈ క్రమంలో పల్లెల కంటే పట్టణాల్లో బోడలకు భలే డిమాండ్ ఉంటుంది. 

పొద్దంతా కాయల కోసం తిరుగాలే...

బోడకాకర కాయల కోసం పొద్దంతా అడవిలో తిరుగుతాం. గూడెం అంతా బోడ కాకరల కోసం వెళ్తాం. అందరం కలిసి వాటాలు పెట్టుకుని పంచుకుంటం, వ్యాపారులు సైకిల్ మోటార్లతో గూడెంకు వచ్చి కొనుక్కుని పోతరు. ఒక్కో ఏటా ఒక్కో రకంగా కాయలు కాస్తయి. మంచిగా కాస్తే మాకు కాస్త పైసలు ఎక్కువస్తయి. 

 జ్యోతి, గిరిజనురాలు, మద్దిమడుగు జయశంకర్ భూపాలపల్లి