calender_icon.png 13 November, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొబ్బిలి రాజుల విజయ ‘జ్యోతి’!

10-11-2024 12:47:55 AM

  1. ఇది వనపర్తి జిల్లాలోని ఓ ఆలయంలో విశేషం
  2. 238 ఏండ్లుగా నిరంతరాయంగా వెలుగుతున్న దీపం 

* బొబ్బిలి వంశానికి చెందిన రాజులు రెండు శతాబ్దాల క్రితం శత్రు రాజులపై విజయాన్ని పురస్కరించుకుని ఆ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించారని చెప్పుకొంటారు. ఆ జ్యోతి ఆరనివ్వకుండా గ్రామానికి చెందిన ఓ అర్చక కుటుంబం నాలుగు తరాలుగా పూజలు చేస్తుండటం మరో విశేషం. 

  1. యుద్దంలో బొబ్బిలి రాజుల ఘన విజయం 
  2. మున్ననూర్ అంజన్న ఆలయంలో అఖండ జ్యోతి ఏర్పాటు 
  3. 238 ఏండ్లుగా నిరంతరాయంగా వెలుగుతున్న దీపం 
  4. ఏటా రెండు సార్లు ఉత్సవాలు.. నాలుగేళ్లుగా నిత్య భజనలు 
  5. నాలుగు తరాలుగా పూజలు చేస్తున్న ఒకే వంశీకులు 
  6. రాజకీయ నాయకులకు సెంటిమెంట్ ప్లేస్

వనపర్తి, నవంబర్ 9 (విజయక్రాంతి): సాధారణంగా భక్తులు మాలధారణ సమయంలో అఖండ జ్యోతిని వెలిగిస్తుంటారు. ఆ జ్యోతి నిరంతరం వెలిగేలా చూడాలని ఓ స్వామిని ఏర్పాటు చేస్తుంటారు. వారు ఆ జ్యోతి ఆరిపోకుండా ఉండేందుకు నూనె పోస్తూ చూస్తుంటారు.

కానీ, వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని మున్ననూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దాదాపు ౨౩౮  ఏండ్లుగా అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు గ్రామస్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుంటారు.  

ఘన చరిత్ర  

సుమారు 238 ఏండ్ల కిందట బొబ్బిలి వంశానికి చెందిన రాజులు శత్రువులపై యుద్ధానికి వెళ్లే సమయంలో గోపాల్‌పేట సంస్థానాధీశుల మద్దతు కూడగట్టుకుని అప్పుడు రాణిగా ఉన్న రంగనాయకమ్మతో సంధి చేసుకున్నారు. అలాగే యుద్ధానికి వెళ్లే దారిలో ఉన్న మున్ననూర్ గ్రామంలో సేద తీరారు.

మరుసటి రోజు అక్కడే ఏకశిలరూపంలో భక్తులకు దర్శనమిస్తున్న వీరాంజనేయస్వామి ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, యుద్దంలో తాము గెలిచి వస్తే అఖండజ్యోతిని వెలిగిస్తామని మొక్కుకుని పోయారు. యుద్ధంలో విజయాన్ని సాధించడంతో మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా అఖండజ్యోతిని వెలిగించిపోయారు.

అఖండజ్యోతి నిత్యం వెలిగేలా తైలం, వత్తులను పంపాలంటే ఇబ్బంది అవుతుందని భావించిన బొబ్బిలి రాజులు.. ఆ బాధ్యత గోపాల్‌పేట సంస్థానాదీశులు రాణి రంగనాయకమ్మకు అప్పగించారు. అందుకు సంబంధించిన ఖర్చును తామే భరిస్తామని వర్తమానాన్ని పంపారు.

అప్పటి నుంచి రాణి రంగనాయకమ్మ అఖండ జ్యోతికి కావాల్సిన సామగ్రి పంపిస్తూ ఆలయంలో అర్చకుడిని ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేయించేవారు. కాలక్రమేణా రాజరిక వ్యవస్థ అంతరించిన తరువాత గ్రామస్థులు విరాళాలను సేకరించి ఆ విరాళాలతో అఖండజ్యోతికి కావాల్సిన తైలాన్ని అందిస్తూ అఖండజ్యోతి నిత్యం వెలిగేలా చేస్తున్నారు. 

రాజకీయ నాయకులకు సెంటిమెంట్  

నాడు యుద్ధం చేసి విజయానికి చిహ్నంగా బొబ్బిలి రాజవంశీయులు ఈ అఖండ జ్యోతిని వెలిగించారు. శతాబ్దాల నుంచి వెలుగుతున్న అఖండజ్యోతిని, వీరాంజనేయస్వామిని దర్శించుకోవడం నేటి రాజకీయ నాయకులకు సైతం సెంటిమెంట్‌గా మారింది. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి అఖండజ్యోతిని దర్శించుకుంటే తాము విజయాలు సాధిస్తామని విశ్వసిస్తారు. అటునుంచి ఏ రాజకీయ నాయకుడు  వెళ్లినా ఆలయాన్ని దర్శించుకోవడం పరిపాటిగా మారింది.

ఏటా రెండు సార్లు ఉత్సవాలు  

ప్రతి ఏటా శ్రావణ మాసం, కార్తిక మాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇప్పటికి గ్రామంలో శుభకార్యాలు, ప్రత్యేక పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో అఖండజ్యోతిని, వీరాంజనేయ స్వామిని దర్శించు కుని వెళ్లడం ఆనవాయితిగా వస్తున్నది. 

నాలుగేళ్లుగా నిత్య భజనలు 

గతంలో ఆలయంలో కేవలం ఉత్సవాల సమయంలో, శనివారాల్లో మాత్రమే అంజన్నకు భజనలు చేసేవారు. గ్రామంలోని యువత ముందుకొచ్చి ప్రతి రోజు రాత్రి సమయంలో నిత్య భజనలను చేసేందుకు నిర్ణయించారు. నాలుగేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, నేటికి కొనసాగుతుంది.

రాతి ఆలయం ఏర్పాటు చేసిన సంస్థానాధీశులు

దాదాపు 400 ఏండ్ల కిందట ఈ ఆంజనేయస్వామి ఆలయాన్ని మట్టితో నిర్మించారు. కాలక్రమేణా గోపాల్‌పేట సంస్థానాధీశులు రాణి రంగనాయకమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని రాతి నిర్మాణంలో పునరుద్ధరింప జేశారు. అదీ శిథిలావస్థకు చేరడంతో 1999లో గ్రామస్థులు విరాళాలు సేకరించుకుని దేవాలయాన్ని పూర్తిగా ఆధునిక రించుకున్నారు. సంస్థానాదీశుల కాలం ముగిసిన తరువాత చమురు (ఆముదం నూనె) కోసం గ్రామస్థులు కొంతమొత్తాన్ని విరాళాన్ని సేకరించి జ్యోతి నిర్వ హణ చూస్తున్నారు. 

తరతరాలుగా జ్యోతిని కాపాడుకుంటున్నాం

రాజ వంశస్థులు ఏర్పాటు చేసిన అఖండజ్యోతి నిత్యం వెలి గేలా మా వంశానికి చెందిన వాళ్ల మే చూసుకుంటు న్నాం. నాడు రాజవంశీయులు, నేడు గ్రామ స్థుల సహకారంతో జ్యోతిని ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే అఖండజ్యోతి ఆరిపోకుండా ఇంకొ కరికి బాధ్యత అప్పగించి వెళ్తాం. మా పూర్వీకుల నుంచి మా తాతలు, వారి ముత్తాతలు, మా తండ్రి , ప్రస్తుతం నేను ఈ దేవాలయ అర్చకులుగా కొనసాగుతున్నాం. 

 ఎస్ వెంకటయ్య, 

వీరాంజనేయస్వామి ఆలయ పూజారి, మున్ననూర్