calender_icon.png 5 October, 2024 | 2:56 PM

పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి

05-10-2024 12:13:27 PM

 పలు అభివృద్ధి పనులకు బోథ్ ఎమ్మెల్యే భూమిపూజ...

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం మౌలిక వసతుల కల్పనకై తనవంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గంలోని బోరిగామ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో రూ. 10 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు, పాఠశాల విద్యార్థులు శాలువతో సన్మానించారు. పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఇచ్చోడ మండలంలోని జాతీయ రహదారి 44 నుంచి కామగిరి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ. 1 కోటి 80 లక్షలతో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో గల దుర్గా దేవి మండపంలో ప్రత్యేక పూజలు చేసి, బతుకమ్మ గద్దె వద్ద మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ... సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. గ్రామంలో అందరూ ఐక్యతతో ఉంటే అన్ని పనులు సాధ్యమవుతాయని, పాఠశాలలో ఇది వరకే అదనపు గదులు నిర్మించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.