- సోమశీలం టు శ్రీశైలం బోటింగ్ పునరుద్ధరణ
- కృష్ణానదిలో 120కిలోమీటర్ల ప్రయాణం
- కట్టిపడేస్తున్న నల్లమల అందాలు
హైదరాబాద్ సిటీబ్యూరో/ నాగర్‌కర్నూల్, నవంబర్ 2 (విజయక్రాంతి): లాహిరి లాహిరిలో అంటూ కృష్ణానదిలో జలవిహారం చేస్తూ అలల సవ్వడులు, ఎత్తున కొండల మధ్య ప్రయాణిస్తూ దట్టమైన పచ్చటి అడవిని చూసి తరిస్తూ శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో విహరించేలా తెలంగాణ టూరి జం శాఖ ప్రత్యేక లాంచీని ఏర్పాటు చేసింది.
రెండేళ్లుగా నిలిచిపోయిన సోమశీల - శ్రీశైలం బోటింగ్ ట్రిప్‌ను కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద ఏసీ బోట్ ప్రయాణాన్ని టూరిజం అధికారులు శనివారం ప్రారంభించారు. ప్రతి వీకెండ్‌లో శని, ఆది వారాలు మాత్రమే ఈ ట్రిప్‌ను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. నల్లమల అడవుల మధ్య దాదాపు 120 కిలో మీటర్లు, 6 గంటలకు పైగా నదిలో ప్రయాణం శ్రీశైలంలోని పాతాల గంగవరకు సాగనుంది.
మొదటిరోజు 70మందితో..
ఒక్కో వ్యక్తికి ఒకవైపు ప్రయాణానికి టికెట్ ధరను పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600లుగా నిర్ణయించారు. అప్ అండ్ డౌన్ ఒక్కరికీ రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా టికెట్ ధరను టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ టికెట్ ధరలోనే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్‌ను అందిస్తారు. ఉద యం 11గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది.
తిరిగి మరునాడు ఉద యం 9:30కు ప్రారంభమై సాయంత్రం 4గంటలకు యథాస్థానానికి చేర్చుతుంది. ఒక్కో లాంచీలో 120 మంది ప్రయాణించవచ్చు. మొదటిరోజు శనివారం దాదాపు 70మందితో లాంచీ ప్రారంభమైంది. ఈ బోట్ తిరిగి ఆదివారం సాయంత్రం సోమశిలకు చేరుకుంటుంది.
ఈ రూట్ లో సోమశిల, అమరగిరి, చీమల తిప్ప, అంకాలమ్మ కోటతో పాటు ఆదివాసీ చెంచులు నివసించే పిట్టగూడుల్లాంటి గుడిసెలను గుండ్లపెంట, లింగమయ్య పెంటలో కనిపిస్తాయి. తర్వాత అక్క మహాదేవి గుహలు దాటి ఈగలపెంట, శ్రీశైలం చేరుకుంటారు.
డిసెంబరు నుంచి ప్యాకేజీ..
ప్రస్తుతం సోమశిల నుంచి శ్రీశైలం బోటింగ్ చేయాలంటే హైదరాబాద్ నుంచి సోమశిల రావల్సి వుంటుం ది. కానీ హైదరాబాద్ నుంచే పర్యాటకులను పిక్ అప్ చేసుకొని సోమశిలకు, అక్కడి నుంచి బోటింగ్ ద్వారా శ్రీశైలానికి..తిరిగి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చేలా పర్యాటక శాఖ ప్రణాళికలు తయారు చేసింది. ఈ ప్యాకేజీను డిసెంబర్ నుంచి అమలు చేయనుంది.
ఈ ప్యాకేజీలో ఒక్కో వ్యక్తికి రూ.5,500లుగా ధర నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఈగలపెంట నుంచి అక్క మహాదేవి గుహల వరకు ఉన్న 12 కిలో మీటర్లు దూరంలో 45 నిమిషాల ప్రయాణంతో కొత్త బోటింగ్ ను డిసెంబర్ నుంచి ప్రారంభించనుంది. ఈ రూట్ లో ఇప్పటికే ఏపీ టూరిజం బోటింగ్ నడుపుతోంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్ బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాలి.