నెరవేరిన నిజామాబాద్ రైతుల పసుపు బోర్డు కల
- పసుపు రైతులకు ప్రధాని మోదీ సంక్రాంతి కానుక
- ఫలించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి
- నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్
నిజామాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): తెలంగాణలోని పసుపు రైతుల చిరకాల కోరిక నెరవేరింది. ఎన్నికలకే పరిమితం అయ్యిందనుకున్న పసుపు బోర్డు ఏర్పాటు ఎట్టకేలకు సాకారం అయ్యింది. నిజామాబాద్ జిల్లాకేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకట న వెలువడింది.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా మంగళవారం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించను న్నారు. తదుపరి బోర్డు పాలకవర్గాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విజ్ఞాపన మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023 అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తున్నట్టు ప్రకటించారు.
౨౦౧౯ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ సైతం రాసిచ్చారు. అప్పటి నుంచి కేంద్రం వద్ద ఆయన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజులుగా పసుపు బోర్డు ప్రయత్నాలు నిలిచి పోయాయి. ఈ విషయంలో ఎంపీ అర్వింద్.. కేంద్ర మంత్రులతోపాటు వ్యవసాయ మంత్రులతో అనేకమార్లు పసుపు బోర్డు విషయమై ప్రస్తావించారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రాధాన్యతను, పసుపు నాణ్యతను, అంతర్జాతీయ మార్కెట్‌లో గల డిమాండ్‌ను బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. పసుపు బోర్డు విషయం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతిపక్షాలకు బ్రహ్మా స్త్రంగా మారిన విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా జిల్లాకే చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
దీంతో జిల్లా రైతుల్లో ఉత్సా హం నిండింది. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పసుపు బోర్డు మహారాష్ట్ర సాంగ్లీకి తరలిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ప్రతిపక్షాలు సైతం ఈ అంశాన్ని ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేశాయి. ఎట్టకేలకు కేంద్రం స్పం దించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంతో ప్రతిపక్షాల విమర్శలకు తావులేకుండా చేసింది.
నేడు ప్రారంభ సమావేశం
జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ సమావేశాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని నిఖిల్ సాయి హోటల్‌లో ఏర్పాటు చేయనున్నట్టు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, స్సైసెస్ బోర్డ్ సెక్రటరీ పీ హేమలత, జాయింట్ సెక్రటరీ యాంగ్ జంగ్ షార్ప్‌తో పాటు స్పైసెస్ బోర్డు డైరెక్టర్ ఏబి రేమాశ్రీ హాజరు కానున్నట్టు తెలిపింది.