- హఠాత్ ర్యాలీలో 1,400 పాయింట్లు జంప్
- 25,400పైన నిఫ్టీ కొత్త రికార్డు
- ట్రేడింగ్ ముగింపు సమయంలో సూచీల పరుగు
తాజా ర్యాలీ సందర్భంగా పలు బ్లూచిప్ షేర్లు నూతన గరిష్ఠస్థాయిని నమోదు చేశాయి. భారతి ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీలు కొత్త రికార్డు స్థాయిని నెలకొల్పడంతో పాటు అదేస్థాయి వద్ద ముగిసాయి. సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా భారతి ఎయిర్‌టెల్ 5 శాతంపైగా పెరిగి రూ.1,642 వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, లార్సన్ అండ్ టుబ్రో, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 4 శాతంవరకూ లాభపడ్డాయి.
బ్లూచిప్ ప్యాక్‌లో నెస్లే ఒక్కటే స్వల్ప నష్టంతో ముగిసింది. అన్ని రంగాల సూచీలూ పాజిటివ్‌గానే ముగిసాయి. అధికంగా మెటల్ ఇండెక్స్ 3.05 శాతం పెరిగింది. టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 2.61 శాతం, పవర్ ఇండెక్స్ 2.02 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 1.99 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.93 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.85 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.79 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1,32 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,335 షేర్లు లాభపడగా, 1,612 షేర్లు తగ్గాయి.278 షేర్లు వాటి 52 వారాల గరిష్ఠస్థాయిని తాకగా, 36 షేర్లు వాటి 52 వారాల కనిష్ఠస్థాయికి పడిపోయాయి.
ముంబై, సెప్టెంబర్ 12: కొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న భారత్ సూచీలు గురువారం ట్రేడింగ్ ముగింపు సమయంలో ఒక్క ఉదుటన పరుగు తీశాయి. కీలకమైన హెవీవెయిట్ షేర్లలో పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరగడం పెద్ద ర్యాలీకి కారణమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 83,000 శిఖరాన్ని అందుకున్నది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 25,400 పాయింట్ల పైకి చేరి సరికొత్త రికార్డును సృష్టించింది.
సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,600 పాయింట్లకుపైగా పెరిగి 83,000 పాయింట్ల స్థాయిని దాటి 83,116 పాయిం ట్ల గరిష్ఠస్థాయిని తాకి కొత్త రికార్డును నెలకొల్పింది. సెప్టెంబర్ 2న నెలకొన్న 82,725 రికార్డుస్థాయిని తాజాగా అధిగమించి లాంగ్ జంప్ చేసింది. చివరకు 1,439 పాయింట్ల లాభంతో 82,962 పాయింట్ల వద్ద నిలిచిం ది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో తొలిసారిగా 25,400 పాయింట్లపైకి చేరి, 25,433 పాయింట్ల వద్ద రికార్డు సృష్టించిం ది. ఈ సూచీకి గత రికార్డుస్థాయి 25,333 పాయింట్లు. చివరకు 470 పాయింట్లు లా భంతో 25,389 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు ప్రధాన సూచీలు ఈ స్థాయిలో ముగియడం కూడా ఇదే ప్రథమం.
బుల్స్ ఆధిపత్యం
అంతర్జాతీయ బుల్లిష్ ట్రెండ్ నేపథ్యంలో బేర్స్ చేతుల్లోంచి మార్కెట్ పగ్గాల్ని ట్రేడింగ్ ముగింపులో బుల్స్ తీసుకుని పరుగులు పెట్టించారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. యూఎస్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశాభావంతో గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ సెంటి మెంట్ ఏర్పడిందన్నారు. అన్ని రంగాలకు చెందిన హెవీవెయిట్ షేర్లలో పటిష్టమైన కొనుగోళ్లు జరగడంతో చివరిగంటలో సూచీలు దూకుడు ప్రదర్శించాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్, హాంకాంగ్‌లు భారీగా లాభపడ్డాయి. యూరప్ సూచీలు గ్రీన్‌లోనే ముగిసాయి. బుధవారం రాత్రి వాల్‌స్ట్రీట్ లాభాలతో నిలిచింది. తాజా యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్‌కు కొంతవరకూ పాజిటివ్ అని, ఈ సెప్టెంబర్ మీట్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు మార్గం సుగమమైనట్లేనని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ఫెడ్ రేట్లను అరశాతం తగ్గించకపోవచ్చని, పావు శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేశారు.
ఎఫ్‌పీఐల భారీ కొనుగోళ్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు వారి కొనుగోళ్ల జోరును పెంచారు. గురువారం ఒక్కరోజులోనే వీరు భారీగా రూ.7,695 కోట్ల నిధుల్ని పెట్టుబడి చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత వారంలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి చేసిన ఎఫ్‌పీఐలు ఈ సోమ, మంగళ, బుధవారాల్లో రూ.4,200 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.
ఒక్క రోజులో రూ.6.5 లక్షల కోట్లు
మార్కెట్ ర్యాలీతో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
సెన్సెక్స్ తొలిసారిగా 83,000 పాయింట్ల స్థాయిని అందుకున్న ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6.59 లక్షల కోట్లు పెరిగింది.. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.6,59,895 కోట్లు పెరిగి రూ.4,67,36,045 కోట్లకు (5.57 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ఈ స్థాయికి భారత స్టాక్ మార్కెట్ విలువ చేరడం ఇదే ప్రధమం.