calender_icon.png 24 October, 2024 | 2:01 PM

చేప పిల్లల పంపిణీపై నీలినీడలు

09-07-2024 04:05:47 AM

  • వానకాలం వచ్చినా ప్రభుత్వం నుంచి అందని ఆదేశాలు 
  • ఎదురు చూస్తున్న మత్స్యకారులు 
  • ఆదేశాలు వస్తే అమలుకు సిద్ధంగా ఉన్న అధికారులు 

వికారాబాద్, జూలై 8 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన చేప పిల్లల పంపిణీ పథకం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తుందా.. లేదా..? అనే విషయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ గురించి ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు. గతేడాది జూలై మాసం నాటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

ఈ ఏడాది వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, టెండర్ల ప్రక్రియలో ఆలస్యం కావడం మత్స్య రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువులు, కుంటల్లో ఇంకా కొత్త నీరు చేరుకోలేదు. ఈ నెలాఖరు నాటికి వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. చేపల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి చెరువుల్లో చేపలు వదిలేందుకు సిద్ధంగా ఉంటే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

నేరుగా నగదు బదిలీపై ఆలోచనలు ?

వికారాబాద్ జిల్లాలో 536 చెరువులు, 10 ప్రాజెక్టులు, 105 మత్స్య సంఘాలు ఉన్నాయి. ఏటా ప్రభుత్వం టెండర్ల ద్వారా ఉచితంగా చేప పిల్లలను ఈ చెరువులు, ప్రాజెక్టుల్లో వదలడంతో మత్స్య కార్మికులకు కొంత ఉపాధి లభించేది. ఈసారి ఇప్పటి వరకు ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పడిపోవడంతో మత్స్య కార్మికుల కుటుంబాలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు చేప పిల్లల టెండర్ల ప్రక్రియపై సర్కారు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో మత్స్య కార్మికుల్లో ఆందోళన కనిపిస్తోంది. పుష్కలంగా వర్షాలు కురిస్తే వెంటనే చేప పిల్లలను పంపిణీ చేయాలని కోరుతున్నారు.

అయితే, చేప పిల్లల ఉచిత పంపిణీకి బదులుగా మత్స్య శాఖ సొసైటీలకు నేరుగా నగదు బదిలీ పథకం అమలు చేస్తే ఎలా అంటుందనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. టెండర్ల సమయంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతున్నందున మత్స్య సొసైటీలకే కొనుగోలు బాధ్యత అప్పగించనున్నట్లు తెలిసింది.