calender_icon.png 7 October, 2024 | 2:51 AM

ఊదేసిన విండీస్

07-10-2024 12:50:08 AM

సరిపోని స్కాట్లాండ్ సత్తా

టాస్ గెలిచినా మ్యాచ్ గెలవని స్కాట్లాండ్

దుబాయ్: స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ విధించిన 99 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.4 ఓవర్లలోనే చేధించి తమకు టీ20లలో ఎవరూ సాటిలేరని మరోమారు చాటి చెప్పింది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది.

కానీ బ్యాటింగ్ ఆరంభించిన కాసేపటికే వారి నిర్ణయం తప్పని రుజువయింది. పరుగులు చేసేందుకు అపసోపాలు పడ్డ స్కాట్లాండ్ ప్లేయర్లు  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేయగలిగారు. స్కాట్లాండ్ జట్టులో అలిసా లిస్టర్ (26) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్లలో ఫ్లెచర్ 3 వికెట్లతో సత్తా చాటింది. విండీస్ బౌలర్లు వికెట్లు ఎక్కువగా తీయకున్నా కానీ పొదుపుగా బౌలింగ్ చేశారు.

100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్లు మాథ్యూస్ (8), టేలర్ (4) విఫలమయ్యారు. పవర్ ప్లేలో కేవలం 46 పరుగులు మాత్రమే చేసిన విండీస్ 2 కీలక వికెట్లు కోల్పోయింది. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా రాణించడంతో వెస్టిండీస్ సులువుగా విజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ల ధనాధన్ ఇన్నింగ్స్‌తో విండీస్ కేవలం 11.4 ఓవర్లలోనే విజయఢంకా మోగించింది.

స్కాట్లాండ్ బౌలర్లలో ఒలివియా బెల్ 2 వికెట్లతో సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన విండీస్ ప్లేయర్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో విండీస్ జట్టు గ్రూప్ తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గెలిచింది ఒక్క మ్యాచే అయినా మెరుగైన నెట్న్ రేట్ కారణంగా తొలి స్థానం సాధించింది.