- తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
- ఒక్కసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి
సంప్రదాయ పంటలతో ఆశించిన అదాయం రాకపోవడంతో అన్నదాతలు రూట్ మారుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ధీర్ఘకాలిక లాభాలు వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశాల్లో ఎక్కువగా సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్స్‌లో ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. అమెరికా, మెక్సికో, చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, థాయిలాండ్, శ్రీలంక, వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. ఈ పండ్లను జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో కలిపి 60 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
జహీరాబాద్, జూన్ 28: సమశీతోష్ణ వాతావరణంలో పండే డ్రాగన్ ఫ్రూట్స్‌కు జహీరాబాద్ నియోజకవర్గంలోని భూములు కూడా అనుకూలమైనవి. ఎకరా సాగుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ పంటను సాగు చేసేందుకు ఎకరాకు 400 సిమెంట్ కడీలను నాటాల్సి ఉంటుంది. వాటికి తీగలు కట్టుకోవాలి. మొదట కదురుకు ఒక మొక్క చొప్పున నాటి పెంచాలి. మొక్కలకు డ్రిప్ పద్ధతిలో రోజుకు 8 లీటర్ల నీటిని అందించాలి.
మొక్కలకు సేంద్రియ ఎరువులు మాత్ర మే వాడాలి. కడీల మధ్య పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పు డు తొలగించాలి. నాటిన ఏడాదిన్నర కాలంలోనే కాతకొచ్చి, దాదాపు 30 ఏండ్ల వర కు పండ్లను ఇస్తూనే ఉం టుంది. జూన్ నెలలో పూత మొదలై విడతల వారీగా డిసెంబరు దాకా పండ్లు పండుతాయి. ఈ పంట సాగులో అనుసరించే యాజమాన్య పద్ధతులను బట్టి కాయ 350 గ్రాముల బరువు ఉంటుంది. మొదటి, రెండవ సంవత్సరం ఎకరాకు టన్ను చొప్పున, మూడో సంవత్సరం నుంచి ఎకరాకు నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
అనేక లాభాలు
ఈ డ్రాగన్స్ ఫ్రూట్స్‌తో అనేక లాభాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండును తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణాశయాన్ని మెరుగు పరిచి, మలబద్ధకాన్ని తొలిగిస్తుంది. పండులోని విటమిన్ సి, విటమిన్ బి3తో పాటు మెగ్నీషియం, కాల్షి యం, ఐరన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సాగులో మంచి లాభాలు
ఎనిమిదేళ్ల కిత్రం ప్రయోగాత్మకంగా కేరళ నుంచి మొక్కలను తెప్పించి ఎకరా పొలంలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేశాను. మంచి లాభాలు రావడంతో ఇప్పుడు దాదాపు పది ఎకరాల్లో సాగు చేశాను. ఈ పంటకు ఎక్కువగా తెగుళ్ల బెడద ఉండదు. నీటి ఎద్దడిని తుట్టుకుంటుంది. ఎర్ర నేలలు, ఎర్ర ఇసుక, సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండి, నీటి నిల్వ తక్కువగా ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలం. మొదటి, రెండో సంవత్సరం దిగుబడి తక్కువగా ఉంటుంది. మూడవ సంవత్సరం నుంచి అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ. 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. చెట్టుకు 25 రోజులకు ఒక్కసారి పండ్లు కాస్తాయి. వ్యాపారులు నేరుగా పొలానికి వచ్చి కిలోకు రూ.100 నుంచి 200 వరకు కొనుగోలు చేసున్నారు. ఈ పండ్లకు మార్కెట్‌లో కిలోకు దాదాపు రూ.300ల నుంచి 400 వరకు ధర ఉన్నది.
మతంశెట్టి వీరేందర్, యువరైతు, హద్నూర్ (న్యాల్‌కల్
మండలం, సంగారెడ్డి జిల్లా)