కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. బుధవారం ఆర్టీసీ డిపో ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల(National Road Safety Month Celebrations) సందర్భంగా రక్తదాన శిబిరాన్ని(Blood Donation Camp) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ... ఆర్టీసీ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఎంతోమంది సమయానికి రక్తము లభించక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత రక్తదానం చేసేందుకు ఉండాలని పిలుపునిచ్చారు. ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయడంవల్ల వ్యక్తిలో రక్త మార్పిడి జరిగి నూతన ఉత్తేజం వస్తుందన్నారు. డిఎంహెచ్ఓ సీతారాం, డిఎం విశ్వనాథ్ తో పాటు కార్మికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.