దేశంలోనే తొలిసారిగా యశోదలో.
.హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక ఇనారీ మెడికల్ డివైస్ ‘పల్మనరీ థ్రోంబెక్టమీ’తో బ్లడ్ క్లాట్స్‌ను తొలగించి కరీంనగర్‌కు చెందిన రిషికేశ్‌కు యశోద దవాఖాన వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ లేని రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు ‘పల్మనరీ ఆర్టరీ’ (పుపుస ధమనులు)లో ఏర్పడ్డ బ్లడ్ క్లాట్స్ వల్ల ఊపిరితిత్తులకు రక్తప్రవాహం ఆగిపోవడంతో పల్మనరీ ఎంబోలిజం ఏర్పడి ప్రాణాపాయ స్థితిలో రిషికేశ్ యశోద హాస్పిటల్‌లో చేరారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ పల్మనరీ ఎంబోలిజం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటిదే అన్నారు. తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుందని చెప్పారు. అయితే, ఈ సమస్యకు అత్యధునిక ఇనారీ మెడికల్ డివైస్‌ను దేశంలోనే మొదటిసారిగా యశోద ఆసుపత్రి అందుబాటు తీసుకొచ్చినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రిషికేశ్ ఈ నెల 28న తీవ్రమైన ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు.
రిషికేశ్‌కు అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులతో కూడిన వైద్య బృందం 24 గంటల పాటు పర్యవేక్షించి తక్కువ సమయంలో రికవరీ అయ్యేలా వైద్యమందించినట్లు తెలిపా రు. కార్యక్రమంలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీ రఘు, డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ నాయుడు, డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.