calender_icon.png 17 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాట్ ఎగవేతకు అడ్డుకట్ట!

17-11-2024 12:00:00 AM

  1. టెక్నాలజీ సహాయంతో ప్రత్యేక ప్రణాళికలు
  2. రహదారులపై నంబర్ ప్లేట్స్ రీడర్స్ ఏర్పాటు 
  3. జీఎస్టీ రద్దు తర్వాత ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు
  4. అప్పటి నుంచి వ్యాట్‌పై కొరవడిన నిఘా
  5. ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.కోట్లల్లో నష్టం
  6. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా సర్కారు చర్యలు

హైదరాబాద్, నవంబర్ 1౬ (విజయక్రాంతి): వాల్యూ ఆడెడ్ ట్యాక్స్(వ్యాట్) వసూళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఆశించిన మేర ఆదాయం రావడం లేదు. దీంతో ఒకవైపు రాబడిని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తూ.. మరోవైపు లీకేజీలను అరికట్టేందుకు సిద్ధమైంది.

అందులో భాగంగానే ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చే వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ సాయంతో వ్యాట్ దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర రహదారులపై ఆటోమెటిక్ నంబర్ ప్లేట్స్ రీడర్స్(ఏఎన్‌పీఆర్) ఏర్పాటు చేయడం ద్వారా వ్యాట్ వసూళ్లలో లీకేజీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది.

ఇందుకోసం రాష్ట్ర రహదారులపై అత్యంత ఉన్నతస్థాయి రెజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఏఎన్‌పీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశం బీఆర్‌ఎస్ హయాంలో చర్చకు రాగా.. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరలో ఏఎన్‌పీఆర్ వ్యవస్థతో వ్యాట్ వసూళ్లను పెంచుకోవాలని భావిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 28,7౦7కి.మీ.ల రహదారులు

తెలంగాణలో 28,707 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ఇన్ని వేల కిలోమీటర్ల నెట్‌వర్క్ ఉన్న స్టేట్ రోడ్లపై ఎక్కడెక్కడ ఉన్నతస్థాయి రెజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయా లి? ఇందుకు ఎంత నిధులు అవసరం అవుతాయి? ఎంతమంది సిబ్బంది కావాలి? రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల అనుసంధానికి కంట్రోల్ రూమ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలి? అనే అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

కొత్తగా హై రెజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే బదులుగా.. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్ కెమెరాలను వినియోగించుకోవాలన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే, జిల్లా సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల్లో కెమెరాలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని మరికొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల జరిగిన నిధుల సమీకరణ సమావేశంలో కూడా ఏఎన్‌పీఆర్ అంశం చర్చకు రాగా.. డిప్యూటీ సీఎం భట్టి కూడా సముఖత తెలిపారు. ఏఎన్‌పీఆర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే రూ.కోట్ల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో నిధులు, సిబ్బంది, కెమెరాలు బిగించే ప్రదేశాలు వంటి అంచనాలను రూపొందించే   బాధ్యతను ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి.. ఆ రిపోర్టు ఆధారంగా ముందుకెళ్లాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఏఎన్‌పీఆర్‌తో లాభమేంటి? 

ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రీడర్స్ ద్వారా వ్యాట్ వసుళ్లపై నిఘా పటిష్టం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2017లో జీఎస్టీ వచ్చినప్పటి నుంచి వ్యాట్ చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండడం తో వ్యక్తిగత తనిఖీలు తగ్గాయి. ఏఎన్‌పీఆర్ వ్యవస్థతో వ్యాట్ చెల్లించిన వాహనాలు అనుమతుల మేరకే వెళ్తున్నాయా? లేదా? అని ఇట్టే పసిగట్టేయ వచ్చు. రహదారులపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఈ వాహనం నంబర్‌ను స్కాన్ చేసి దాన్ని రిజిస్టర్ చేస్తుంది. ఆ వాహనం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇట్టే తెలిసిపోతుంది. దీంతో వ్యాట్ ఎగవేతలకు కళ్లెం పడినట్లు అవుతుందని సర్కారు యోచిస్తోంది. 

రూ.కోట్లలో నష్టం

సాధారణంగా రూ.50వేలపైన ఉన్న ఇన్వాయిస్‌లపై వాణిజ్య పన్ను ల శాఖ వ్యాట్‌ను వసూలు చేస్తోంది. వస్తువును తీసుకెళ్లే దూరాన్ని బట్టి వ్యాట్ పెరుగుతుంది. అయితే కొం దరు తక్కువ వ్యాట్ చెల్లించి ఎక్కువ దూరానికి ఆ వస్తువును తరలిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం చూస్తోంది.