ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు ఎలా ‘బ్లాక్ డే’ అవుతుంది ?
కశ్మీర్ అభివృద్ధి కనిపించడం లేదా?
సుప్రీం కోర్టు తీర్పును కూడా అగౌరవ పరుస్తారా ?
ప్రకటనలో కేంద్ర మంత్రి, కశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ‘జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ఆర్టికల్ 370 రద్దు చేస్తే.. ఆ రోజు ‘బ్లాక్ డే అవుతుందా? సుప్రీం కోర్టు తీర్పును కూడా అగౌరవ పరుస్తారా ? జమ్మూకశ్మీర్ అభివృద్ధి కాంగ్రెస్ నేతల కళ్లకు కనిపించడం లేదా ? కాంగ్రెసోళ్ల కళ్లకు గంతలు కట్టుకున్నారు’ అంటూ సోమవారం కేంద్ర మంత్రి, కశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇంచార్జి కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ రోజును కాంగ్రెస్ పార్టీ ‘బ్లాక్ డే’గా పరిగణించడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ ప్రజల స్వేచ్ఛగా ఉండడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు కశ్మీర్‌లో అశాంతి నెలకొనడానికి కాంగ్రెస్సే కారణమ న్నారు. కశ్మీర్ అభివృద్ధి చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు.
రిజర్వే షన్‌కు దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేలా చేయడాన్ని కూడా తప్పుబడతారా? అని నిలదీశారు. కేంద్రం కశ్మీర్‌లో రూ.58,477 కోట్ల పీఎం అభివృద్ధి ప్యాకేజీ నిధులతో 53 కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేసిందన్నారు. కొత్తగా యువతకు 16,650 ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నదని స్పష్టం చేశారు.
ఇప్పుడు కశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారన్నారు. వెనుకబాటు నుంచి ఇప్పుడు కశ్మీర్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. ఇన్ని విజయాలు ఆర్టికల్ 370 రద్దుతో సాధ్యమైందన్నారు. కానీ రద్దు చేసిన రోజును చీకటి రోజుగా జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ పైశాచికమని దుయ్యబట్టారు. ఎవరెన్ని అన్నా తమ ప్రభుత్వం కశ్మీర్‌ను అభివృద్ధి చేసే తీరుతుందని స్పష్టం చేశారు.