04-09-2024 01:23:56 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న కొండ రాళ్ల తొలగింపునకు చేపట్టిన పేలుళ్ల వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. దీనిపై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక హైకోర్టుకు లేఖ రాశారు. రోజుకు 10కి తగ్గకుండా పేలుళ్లు నిర్వహిస్తున్నారని, తొలగించిన రాళ్లను రాత్రిపూట రవాణా చేస్తున్నట్టు న్యాయమూర్తి లేఖలో పేర్కొన్నారు.
దీనివల్ల సమీపంలోని న్యాయవిహార్, భరణి లేఔట్, రామానాయుడు స్టుడియో పరిసర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శబ్దాలతో రాత్రిపూట ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పత్రికా కథనం ఆధారంగా న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా తీసుకుంది. భూగర్భ గనుల శాఖ, పర్యావరణ మంత్రిత్వశాఖ, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ డైరెక్టర్, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీలను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.
దిశ ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన పిల్‌తోపాటు ఇతర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది బృందాగోవర్ వాదనలు వినిపిస్తూ దిశ హత్యాచార ఘటన దురదృష్టకరమైనదేనని అన్నారు.
నిందితులను చట్టప్రకారం శిక్షించాల్సి ఉందని, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని చెప్పారు. ఈ కేసులోని నిందితులను 2019 డిసెంబరు 6న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ చేశారన్నారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో విచారణ నిమిత్తం జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో పోలీసుల పాత్రను స్పష్టంగా పేర్కొన్నట్టు గుర్తుచేశారు.
కమిషన్ ప్రతి ఒక్కరినీ విచారించిన తరువాతనే స్పష్టమైన నివేదికను సమర్పించిందని అన్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలంటూ సుప్రీం వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు. చనిపోయిన వారిపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
విద్యానిధి సాయంపై ప్రభుత్వం అప్పీల్ కొట్టివేత
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి (ఏవోవీఎన్) కింద కరీంనగర్‌కు చెందిన విద్యార్థికి ఆర్థిక సాయం అందించాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఫిబ్రవరిలో తీర్పు వెలువరించగా 161 రోజుల తరువాత ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిందని, ఇంత జాప్యానికి సరైన కారణం చెప్పకపోవడంతో అప్పీల్‌ను అనుమతించలేమంటూ కొట్టివేసింది.
ఆదాయం రూ.2 లక్షలు దాటిందన్న కారణంగా ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద తన కుమారుడి దరఖాస్తును తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జీ వెంకటనరహరి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పెన్షన్ సొమ్ము రూ.2 లక్షలు వస్తుందని, అందులో మెడికల్ బిల్లులు, ఇంటి రుణం పోను రూ.1.70 లక్షలు ఉంటుందని, అందువల్ల సాయం అందించాలంటూ ఉత్తర్వులు వెలువరించారు.
దీన్ని సవాల్ చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఫిబ్రవరిలో తీర్పు వెలువరించగా అప్పీలు దాఖలు చేయడానికి 161 రోజుల జాప్యం జరిగిందని, దీనికి సరైన కారణాలు చెప్పకుండా అనుమతించలేమంటూ కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పు ప్రకారం సాయం అందించాల్సి ఉంది.