calender_icon.png 25 November, 2024 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిటోనేటర్లతో అక్రమ నిర్మాణం పేల్చివేత

27-09-2024 02:58:13 AM

  1. మల్కాపూర్ చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమణలపై చర్యలు 
  2. రాయి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయలు

సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 26 : చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలను బుల్డోజర్లతో కూల్చడం చూశాం. కానీ, సంగారెడ్డి జిల్లాలో అధికారులు ఏకంగా డిటోనేటర్లనే వాడి అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఓ మూడంతస్తుల భవనాన్ని అధికారులు డిటోనేటర్లు పెట్టి కూల్చివేశారు. కొండాపూర్ మండలంలోని కుతుబ్‌షాయిపేట (మల్కాపూర్) పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా నిర్మాణం చేసి భవనాలను గురువారం కూల్చివేశారు. 

మండల రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చెరువు ఎఫ్టీఎల్ ను సర్వే చేసి, నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దానిని పరిశీలించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు.. చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను డిటోనేటర్లుతో పేల్చివేశారు. ఈ చెరువు సంగారెడ్డి పట్టణానికి సమీపంలో ఉండటంతో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. చెరువు పరిధిలో నిర్మాణాలను గతంలో కొండాపూర్‌లో పని చేసిన అధికారులు ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేడయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

హోంగార్డుకు తీవ్ర గాయలు

మల్కాపూర్ చెరువులో డిటోనేటర్లతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న క్రమంలో ఓ హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. కూల్చివేతల సమయంలో అక్కడే ఉండి వీడియో చిత్రీకరిస్తున్న హోంగార్డు గోపాల్ తలకు రాయి తగిలి గాయపడ్డాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసు వాహనంలో సంగారెడ్డి దవాఖానకు తరలించారు.