calender_icon.png 24 September, 2024 | 3:59 PM

న్యాయవ్యవస్థపై నిందలా?

21-09-2024 02:37:23 AM

సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ, సెప్టెంబర్ 20 : పశ్చిమ బెంగాల్‌లో 2021 ఎన్నికల తరువాత జరిగిన హింసపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నందున ఈ కేసుల విచారణను బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెంగాల్‌లోని మొత్తం న్యాయవ్యవస్థపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై తప్పుపట్టింది.

సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బదిలీ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఈ పిటిషన్ ధిక్కార నోటీసుకు తగిన కేసని, న్యాయవాదికి సమన్లు జారీ చేస్తామని ధర్మాసనం బెదిరించింది. దీంతో ఏఎస్‌జీ రాజు స్పందిస్తూ పిటిషన్‌లో రాతలో కొంత లోపం ఉందని, దానిని సవరిస్తామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేయలేదని చెప్పి క్షమాపణలు కోరారు. దీంతో కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది.