calender_icon.png 22 April, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లాక్‌మెయిలింగ్ యూట్యూబ్ ఛానళ్లు..

22-04-2025 12:00:00 AM

వాటిపై కఠిన చర్యలు తీసుకోండి l కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): జర్నలిజంలో అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలు చేస్తూ, కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం వేములవాడలో స్థానిక ప్రెస్‌క్లబ్ (ఐజేయూ)ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టు సంఘాలు, ప్రెస్‌క్లబ్ నిర్వాహకులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలని కోరారు. ప్రజా సమస్యలపై పనిచేసే యూట్యూబ్ ఛానళ్లను ప్రోత్సహించాలన్నారు. ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మించడంతోపాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్ అధ్యక్షతన బండి సంజయ్‌ను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామక్రిష్ణ, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కుమ్మరి శంకర్, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు బండి సంతోష్ పాల్గొన్నారు.