calender_icon.png 23 March, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రతినిధుల అసమర్ధత వల్లే కృష్ణ జలదోపిడి

22-03-2025 06:54:55 PM

రౌండు టేబుల్ సమావేశంలో వక్తలు...

కల్వకుర్తి: కరువు కాటకాలతో అల్లాడుతున్న పాలమూరు ప్రాంత రైతులకు కృష్ణా నీటితో అందించాల్సింది పోయి పాలమూరు ప్రాజెక్టు నుండి అక్రమంగా డిండి, నల్గొండ ప్రాంతానికి తరలిస్తున్నా ఈ ప్రాంత పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని పాలమూరు అధ్యయన వేదిక, కల్వకుర్తి జేఏసీ బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. శనివారం పట్టణంలోని యుటిఎఫ్ భవనంలో జల దోపిడిపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేషానికి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ఇరిగేషన్ నిపుణులు కేవి హాజరై మాట్లాడారు. 1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నీళ్ళ విషయంలో పాలమూరు జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయానికి గురి చేసిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా పాలమూరు జిల్లాకు అదే దుస్థితి నెలకొందన్నారు.

మనకు దక్కాల్సిన నీటిని పట్టపగలే నల్లగొండ జిల్లాకు తరలించుక పోతుంటే అడ్డగించాల్సిన 14 మంది ప్రజాప్రతినిధులు నోరు మెదపడంలేదని మండిపడ్డారు. దశాబ్దాలుగా కరువు, పేదరికము, నిరుద్యోగము, వలసలు అనారోగ్యము, కుటుంబ జీవన విధ్వంసం ఈ పాలమూరు జిల్లాలో రోజు రోజుకు పెరిగిపోతొందన్నారు. దేశమంతటా ఎన్నో ప్రాజెక్టులు కట్టి కాలువలు త్రొవ్వి, భీడు భూముల్ని  పంటపొలాలుగా మార్చి తమ చెమట నెత్తురుని  దారబోసిన పాలమూరు రైతాంగ బిడ్డలు నేడు సాగునీరు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలసల జిల్లా, లేబర్ జిల్లాగా ఉన్న పాలమూరు రిజర్వాయర్ల జిల్లాగా మారేదెన్నడు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జేఏసి చైర్మన్ సదానందం గౌడు, సిఐటియు ఆంజనేయులు, కెవిపిఎస్ పరశురాములు, బిజెపి బాబీ దేవ్, సిపిఐ పరశురాములు, బిఎస్పి అంజి, బీసీ సబ్ ప్లాన్ రాజేందర్, గోపాల్, సైదులు యాదవ్, బాలయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.