calender_icon.png 23 October, 2024 | 12:44 AM

నల్లధనం ఏదంటే తెల్లముఖం

04-05-2024 02:27:18 AM

ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీని నల్లధనం ఏదయ్యా అంటే తెల్లముఖం వేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. 2014లో బడే భాయ్ మోదీ మస్తు కథలు చెప్పిండని, రూ.15 లక్షల నగదు, ప్రతి ఒక్కరికీ ఇళ్లు, బుల్లెట్ ట్రైన్ అంటూ పెద్ద బిల్డప్‌లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్‌మండి రోడ్ షోలో శుక్రవారం కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఐదేళ్లలో పైసా పనిచేయకుండా కేవలం కుర్‌కురేలు మాత్రమే పంపిణీ చేశారని ఎగతాళి చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.

మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేలు, యువతులకు స్కూటీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టగానే కరెంటు, నీళ్ల కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. ఖైరతాబాద్‌లో మన పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారని, ఆ తర్వాత బీజేపీలో చేరరని గ్యారెంటీ ఏదన్నారు. కేసీఆర్‌కు పద్మారావుగౌడ్ తమ్ముడి లాంటివారని, ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్‌తోనే ఉన్నారన్నారు. సికింద్రాబాద్‌లో పద్మారావుగౌడ్ 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. రోడ్ షోలో అభ్యర్థి పద్మారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.