calender_icon.png 8 April, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లాక్ మండే!

08-04-2025 01:50:44 AM

ఒక్కరోజే బీఎస్‌ఈలో 14 లక్షల కోట్ల సంపద ఆవిరి

  1. 10 నెలల కనిష్ఠానికి బీఎస్‌ఈ సెన్సెక్స్
  2. సెన్సెక్స్ 2,226 పాయింట్లు, నిఫ్టీ 742.85 పాయింట్లు కిందికి..
  3. హాంకాంగ్ మార్కెట్ 28 ఏండ్లలో చూడని పతనం
  4. యూఎస్ మార్కెట్లలో కరోనా తర్వాతి పరిణామం 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వార్‌తో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు సోమవారం చిరుగుటాకుల వణికాయి. ఇష్టారాజ్యంగా జరిగిన అమ్మకాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. హాంకాంగ్ స్టాక్ మార్కె ట్ హాంగ్‌సెంగ్ గత 28 ఏండ్లుగా చూడని భారీ పతనాన్ని చవిచూసింది. కరోనా సంక్షోభం తర్వాత అమెరికా మార్కెట్లు ఇంత స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.

ప్రపంచంలోని తొలి 500 మంది కుబేరుల సంపద 208 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నా వారెన్ బఫెట్ సంపద మాత్రం అమాంతం పెరిగింది. సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపర్లు బేర్ మన్నారు. సోమవారం భారత మార్కెట్లు ప్రారంభమైన వెంటనే తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్ 2,226.79 పాయింట్ల మేర నష్టపోయి 73,137.90 వద్ద, నిఫ్టీ 742.85 పాయింట్లు నష్టపోయి 22,161.60 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్ ఇంతలా దిగజారడం ఈ పదినెలల్లో ఇదే ప్రథమం. సెన్సెక్స్ 2.95 శాతం మేర, నిఫ్టీ 3.24 శాతం మేర నష్టాల్ని చవిచూశాయి. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల సంపద రూ. 14 లక్షల కోట్ల మేర ఆవిరైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.85గా ఉంది.

జపాన్ నిక్కీ 8.4 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 15.24 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 6.6 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 200 4.5 శాతం, దక్షిణ కొరియా కోస్పి 5.89 శాతం, తైవాన్ టైక్స్ 9.7 శాతం, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 8 శాతం, అమెరికా డోజోన్స్ ఫ్యూచ ర్స్ 2 శాతం మేర పడిపోయాయి. భారత మార్కెట్లలో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం క్, టీసీఎస్, ఎయిర్‌టెల్ వంటి షేర్లు భారీగా నష్టపోగా, సీమెన్స్, బ్రిటానియా వంటి కంపెనీలు కొద్ది మేర లాభాలు చవిచూశాయి.

మార్కెట్ల పతనంతో భారత్‌లో ఉన్న మిలియనీర్ల సంపద హాంఫట్ అయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనంపై.. ‘మార్కెట్‌లో ఏం జరుగుతోందో చెప్పలేను. అమెరికా మాత్రం బలంగా ఉంది. పతనాన్ని నేను కోరుకోవట్లేదు. కొన్ని సార్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు చేదు మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు మార్కెట్ల పతనం రాజకీయంగా మాటల యుద్ధానికి తెరతీసింది.