13-03-2025 01:02:41 AM
ఇస్లామాబాద్, మార్చి 12: పాకి స్థాన్‌లో ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ కథ సుఖాంతం అయింది. రైలును హైజాక్‌చేసి ప్రభుత్వానికి సవాలు విసిరిన 33 మంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) వేర్పాటువాదులను ఆర్మీ మట్టుబెట్టి అందులో ఉన్న ప్రయాణికులను కాపాడింది.
మంగళవారం ప్రయాణికులతో వెళ్తున్న ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ను హైజాక్ చేసిన బలోచ్ వేర్పాటువాదులు తమవారిని విడుదల చేయాలని పాక్ ప్రభుత్వా నికి 48 గంటల డెడ్‌లైన్‌ను విధించారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ మొదలుపెట్టిన పాక్ ఆర్మీ 48 గంటల గడువు కంటే ముందుగానే వేర్పాటువాదులను మట్టుబెట్టి అందులో ఉన్న ప్రయాణికులను కాపాడింది.
వేర్పాటువాదులు 21 మంది ప్రయాణికులను, నలుగురు పారామిలటరీ సైనికులను పొట్టనపెట్టుకున్నట్లు ఆర్మీకి చెందిన అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘ఆర్మీ దళాలు బుధవారం విజయ వంతంగా ఆపరేషన్‌ను ముగించాయి. రైలును హైజాక్ చేసిన వేర్పాటువాదులను మట్టుబెట్టి ప్రయాణికులను కాపాడారు’ అని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ వెల్లడించా రు.
బుధవారం ఉదయం నుంచే విడతలవారీగా ప్రయాణికులను కాపాడుకుంటూ వచ్చిన ఆర్మీ సాయం త్రం కల్లా రైలులో ఉన్న వేర్పాటువాదులందరినీ మట్టుబెట్టి ఆపరేషన్‌ను విజయ వంతంగా ముగించింది. బలోచ్ వేర్పాటువాదులు రైలును హైజాక్ చేసి తమ వారిని విడిపించుకునేలా పథకం వేశారు. వారు ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 200 మంది ప్రయాణికులను బంధించినట్లు వార్తలు వచ్చాయి.
బాంబులు అమర్చిన జాకెట్లు ధరించి ప్రయాణికుల పక్కనే కూర్చుని బందీలను ఇబ్బందులకు గురి చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఆపరేషన్ పూర్తయిందని ఆర్మీ ప్రకటించే కంటే ముందు రైలులోని ప్రయాణికుల్లో 50 మందిని హతమార్చినట్లు వేర్పాటువాదులు ప్రకటించారు.