04-04-2025 01:06:44 AM
జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్
సిద్దిపేట, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6 న ఆవిర్భవిం చిందని ఆ రోజు నుంచి జిల్లాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ప్రారంభమవుతాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ వెల్లడించారు. గురువారం సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్ 6 న పార్టీ కార్యాలయాలలో జెండా ఆవిష్కరించడం, ఏప్రిల్ 7 ప్రతి క్రియాశీల కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగరవేయడం, 8, 9 తేదీలలో క్రియాశీలక సభ్యులతో సమావేశం, 10, 11, 12 తేదీలలో బస్తీ చలో అభయాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు 5కేజీల సన్న బియ్యం సరఫరా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం హాస్యస్పదంగా ఉందన్నారు. రేషన్ షాప్ ల వద్ద ప్రధానమంత్రి మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోపు జిల్లాలోని మండల, బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తి రెడ్డి పాల్గొని మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడంలో ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వంగ రామచంద్రారెడ్డి, దూది శ్రీకాంత్ రెడ్డి, సురేంద్రారెడ్డి, సతీష్, గుండ్ల జనార్ధన్, రామ్ రెడ్డి, శివ, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.