calender_icon.png 11 March, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌పై బీజేపీ పోరాటం!

11-03-2025 12:19:41 AM

  1. మాస్టర్‌ప్లాన్‌తో పేద రైతులకు నష్టమంటున్న కమలం పార్టీ 
  2. రైతులకు అనుకూలమైన జోన్ల కోసం ఉద్యమం

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప లు ఉద్యమాలు, ఆందోళనల ద్వారా తన బలాన్ని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్ని స్తోంది. ఇప్పటికే హైడ్రా, మూసీపై పోరాటాలు చేసిన ఆ పార్టీ.. తాజాగా హెచ్ ఎండీఏ మాస్టర్ ప్లాన్‌పై మరో పోరుకు సిద్ధమైంది. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తామని బీజేపీ నేతలు చెపుతున్నారు.

హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో రైతుల భూములను పట్టణాభివృద్ధి పేరుతో కేటాయించడం వల్ల అన్నదాతలకు కష్టాలు ఏర్పడుతున్నాయని బీజేపీ దానిని గట్టిగా వ్యతిరేకిస్తోంది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో 7,257 చ.కి.మీ. విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు.

2013లో రూపొందించిన ప్లాన్‌లో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించడంతో రైతులకు తీవ్రనష్టమని పార్టీ నేతలు అంటున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని 70 మండలాలు, 24 మున్సిపాలిటీలు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 

ఇండ్ల నిర్మాణాలకు అవకాశం కల్పించాలి

మాస్టర్ ప్లాన్‌లో భూములను కన్జర్వేషన్ (వ్యవసాయం), పబ్లిక్ - సెమీ పబ్లిక్, రిక్రియేషన్, ఓపెన్ స్పేస్, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్, పెరి అర్బన్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీయల్, మల్టీపుల్ ఇలా తదితర జోన్లుగా మార్చారు. అయితే పేద, అమాయక రైతులకు చెందిన అనేక భూములు ఇండ్ల నిర్మాణానికి అవకాశం లేని కన్జర్వేషన్ లాంటి జోన్లలో ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు.

ఈ కారణంగా 50 వేల మంది రైతులు తమ భూముల పరిధిలో సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి తెలిపారు. కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, బడాబాబులు మాత్రం వారి భూముల్లో ఎన్ని అంతస్తుల్లోనైనా నివాసాలను నిర్మించుకుంటున్నారని, ఇక్కడే పేద, ధనిక అంతరం తెలుస్తోందని బీజేపీ అంటోంది.

ఎకరా, రెండెకరాలు ఉన్న పేద రైతులు ఇండ్ల నిర్మాణానికి దూరమవుతున్నారని వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని మల్లారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌పై బీజేపీ డిమాండ్లు

* మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసి రైతులకు ప్రయోజనం కలిగేలా చేయాలి

* రింగురోడ్డు లోపల ఉన్న భూములన్నింటినీ నివాస జోన్లుగా మార్చాలి

* రింగురోడ్డు బయట ఉన్న ప్రతీ రైతుకు 5 ఎకరాల వరకు జోన్లు మార్చుకునేందుకు అవకాశమివ్వాలి

* జోన్ల మార్పిడిని సులభతరం చేయాలి

* రింగు రోడ్డుకు ఆనుకొని ఉన్న భూములకు సర్వీస్ రోడ్డుతో అనుసంధానించే అవకాశం కల్పించి, రవాణా సౌకర్యం లభించేలా చూడాలి.

* వ్యవసాయ కార్యకలాపాలకు తగిన మౌలిక వసతులు కల్పించాలి.

* కేవలం కార్పొరేట్లకు లబ్ధి కలిగించేలా కాకుండా, రైతులకు కూడా ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్‌ను సవరించాలి.