21-04-2025 12:00:00 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్
కరీంనగర్ ఏప్రిల్20(విజయక్రాంతి): భారతదేశంలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ, భారతదేశ రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేయడానికి బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దేశంలో మావోయిస్టులను చంపమని భారత రాజ్యాంగంలో ఏమైనా పొందుపరచారా అమిత్ షాకి ఆ అధికారం ఎవరిచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆదివారం కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో విభిన్న కులాలు,మతాలు, జాతులు,ప్రాంతాలు కలిగి ఉన్నాయని అన్ని వర్గాల వారు నీళ్లు పాలలాగా కలిసి ఉండే దేశంలో బిజెపి ప్రభుత్వం వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని, మతం ముసుగులో అనేక మంది రెచ్చగొడుతూ పౌరుల హక్కులను హరిస్తుందని,పౌరసత్వం,370 ఆర్టికల్,కాశ్మీర్ సమస్య ఇలా అనేక విషయాలలో తప్పిదాలు చేస్తూ బీజేపీ తన సొంత లాను అమలు చేయాలని చూస్తుందని ఆరోపించారు.
తెలంగాణలో మీ ఆటలు సాగవని ఏ పేరుతో మీరు ప్రజలను ఓట్లు అడుగుతారని విభజన హామీలు అమలు పరచామని అడుగుతారా? తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని అడుగుతారా? కేంద్రం నుండి రావలసిన నిధులు ఇస్తున్నామని అడుగుతారా ?బిజెపి నేతలు సమాధానం చెప్పాలని అన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి,కొయ్యడ సృజన్ కుమార, బోయినిఅశోక్, టేకుమల్ల సమ్మయ్య లు పాల్గొన్నారు.