దేశంలో ఆ పార్టీ పని అయిపోయింది
తెలంగాణ నుంచే మార్పు మొదలైంది
బడా వ్యాపారులకే మోదీ సేవలు
పేదలను పట్టించుకొన్న పాపాన పోలేదు
కార్పొరేట్ మిత్రులకు 16 లక్షల కోట్లిచ్చిన మోదీ
పేద రైతుకు లక్ష రుణం మాఫీ చేయలేదు
కాంగ్రెస్ వస్తే ప్రతి మహిళ అకౌంట్లో లక్ష
కామారెడ్డి, తాండూరు సభల్లో ప్రియాంకగాంధీ
కామారెడ్డి/వికారాబాద్, మే 11 (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అన్నారు. అందుకు తెలంగాణ నుంచే మార్పు మొదలైందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డి పట్టణంతోపాటు చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని తాండూరులో ఏర్పాటుచేసిన సభల్లో ఆమె మాట్లాడారు.
దేశంలో బీజేపీ పని అయిపోయిందని స్పష్టంచేశారు. బీజేపీ అధికారం కోసమే పాకులాడుతుంది తప్ప ప్రజల మేలు గురించి ఆలోచించటం లేదని విమర్శించారు. పదేండ్లు దేశాన్ని పాలించిన నరేంద్రమోదీ.. పేద ప్రజలకు ఒక్క మేలు కూడా చేయలేదని ధ్వజమెత్తారు. దేశ సంపద రూ.16 లక్షల కోట్లను తన మిత్రులకు, బడా వ్యాపారులకు కట్టబెట్టారని ఆరోపించారు. పేద రైతులకు మాత్రం రూ.లక్ష రుణమాఫీ కూడా చేయలేదని దుయ్యబట్టారు.
పేదల పట్ల మోదీకి ప్రేమ లేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను, విమానాశ్ర యాలు, విమాన సంస్థలు, ఎల్‌ఐసీ, రైల్వేలను ప్రవేట్‌పరం చేశారని, కొత్తగా ఒక్క ప్యాక్టరీ కూడా ప్రారంభించలేదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. ‘పేదలు రూ.500 రుణం కూడా చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ వాస్తవాలు సమాజానికి తెలియకుండా మీడియాను మేనేజ్ చేస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, నిరుద్యోగుల కోసం బీజేపీ ఎప్పుడూ పనిచేయలేదు. చిన్న వ్యాపారుల సమస్యలు ఏటా పెరుగుతున్నాయి.
రైతులు నష్ట పోతున్నా కేంద్ర సహకారం అందడంలేదు. మోదీకి కామారెడ్డి సభ నుంచి చెప్తున్నా.. దేశంలో బీజేపీ పని ఇక ఖతం’ అని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి మహిళ అకౌంట్‌లో రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కూలీల రోజువారీ కూలీ రూ.400కు పెంచుతామని చెప్పారు. ‘ఈ దేశం ప్రేమ, అహింస, సత్యంపై ఆధారపడింది. అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముళ్లలా కలిసి ఉంటారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ప్రజలు మరిచిపోలేదు’ అని పేర్కొన్నారు.
రాజ్యాంగంపై కుట్రలను అడ్డుకొందాం
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుందని ప్రియాంకగాంధీ ఆరోపించారు. తాండూరులో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలకు తాండూరు నుండే గండి కొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని నరేంద్రమోదీ రాయలేదని, భారత ప్రజలు రాసుకున్నారని తెలిపారు. దేశంలో నిరుద్యోగులు 70 కోట్లకు పెరిగిపోయారని, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్యుల నడ్డి విరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సామాన్య ప్రజలపై భారీగా పన్నుభారం వేస్తూ, ధనవంతులకు వెసులబాటు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు.
రైతు రుణమాఫీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు అడిగినా తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా స్పందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీతోపాటు, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర లభించేలా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై జీఎస్టీ రద్దు చేస్తామని తెలిపారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
బీజేపీకి గుణపాఠం చెప్పాలి
తెలంగాణలో బీజేపీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. ఓట్లకోసం తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఏమైనా ఇస్తారనుకుంటే ఉత్త ఉపన్యాసాలిచ్చి పోయారని విమర్శించారు. తెలంగాణకు గాడిద గడ్డు ఇచ్చిన మోదీకి కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశంలో ఇప్పటివ రకు జరిగిన ఎన్నికలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు వేరు అని సీఎం పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని హెచ్చరించారు. సమావేశాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు మనోహర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మదన్‌మోహన్‌రావు, తోట లక్ష్మీకాంతరావు, కైలాస్ శ్రీనివాస్‌రావు, మహమ్మ ద్ ఇలియాస్, రవీందర్‌రెడ్డి, కాసుల బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నుంచే మార్పు మొదలైంది
దేశ సంపద రూ.16 లక్షల కోట్లను ప్రధాని మోదీ తన మిత్రులకు, బడా వ్యాపారులకు కట్టబెట్టారు. పేద రైతులకు మాత్రం రూ. లక్ష రుణమాఫీ కూడా చేయలేదు. పేదల పట్ల మోదీకి ప్రేమ లేదనడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వరంగ పరిశ్రమలను, విమానాశ్రయాలు, విమాన సంస్థలు, ఎల్‌ఐసీ, రైల్వేలను ప్రవేట్‌పరం చేశారు. కొత్తగా ఒక్క ప్యాక్టరీ కూడా ప్రారంభించలేదు. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు వేస్తారా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. తెలంగాణ నుంచే మార్పు మొదలైంది.
కామారెడ్డి, తాండూరు సభల్లో ప్రియాంకగాంధీ