న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయజెండా ఎగిరింది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలయింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ సహా పలువురు ఓటమి చవిచూశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అధికారం దక్కించుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానంలో బీజేపీ 48 స్థానంలో విజయం సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. పలువురు నేతలు మోదీని గజమాలలతో సత్కరించారు.