తెలంగాణకు వరుస కానుకలు!
- నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు
- ఇప్పటికే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ..
- హైదరాబాద్‌లో రీజినల్ రింగ్ రోడ్డు
- భవిష్యత్‌లో రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు?
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేకం గా దృష్టి సారించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవడమే లక్ష్యం గా బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బీజేపీ తన ఉనికిని చాటు కునే ప్రయత్నం చేస్తోంది. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ఇప్పటికే అందించిం ది.
ఎవరూ ఊహించని విధంగా జాతీయ పసుపు బోర్డును తెలంగాణకు సంక్రాంతి కానుకగా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు ఇది ప్రధాని మోదీ బహుమతిగా ప్రకటించింది. పసుపుతో పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది.
టార్గెట్ తెలంగాణ..
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో ఇప్పటికే 8 అసెంబ్లీ, అంతే సంఖ్యలో ఎంపీ సీట్లతో సత్తా చాటిన కమలం పార్టీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంఖ్యను అధికార పీఠంవైపు మళ్లించేలా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రానికి ఆర్‌ఆర్‌ఆర్ ఇచ్చిన కేంద్ర ప్రభు త్వం త్వరలోనే రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
దేశంలో ఇలాంటి రైల్వే ప్రాజె క్టు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదు. తెలంగాణకు ఇస్తే మాత్రం అదో పెద్ద అఛీవ్‌మెంట్ అవుతుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులను దాదాపుగా మంజూరు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం అంగీకరిస్తోంది. దీనికి తోడు అనేక కొత్త రైల్వే ప్రాజెక్టులను సైతం రాష్ట్రానికి మంజూరు చేస్తున్నారు.
హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి సహా 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ.2వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సైతం కేంద్రం ఇచ్చింది. దీంతో తెలంగాణకు ఊహించని విధంగా ప్రాజెక్టులు కేంద్రం నుంచి తరలివస్తున్నాయి. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే లక్ష్యంతోనే బడ్జెట్ కేటాయింపులు లభిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇవ్వమంటే ఇవ్వం అంటూ..
మొదట కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇవ్వమని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది ఎన్డీఏ సర్కారు. దీంతో కోచ్ ఫ్యాక్టరీ రాదని ఇక్కడి ప్రజలు, రాజకీయ నాయకులు భావించారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా వ్యాగన్ వర్క్‌షాపును కాస్త కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సీన్ నిజామాబాద్‌లోనూ రిపీట్ అయ్యింది.
అక్కడ పసుపు బోర్డును ఇవ్వలేమని పేర్కొంటూ మొదట స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇది నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కే కాదు తెలంగాణ బీజేపీకే శరాఘాతంగా మారుతుందని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే స్పైసెస్ రీజినల్ కార్యాలయం పోయి జాతీయ పసుపు బోర్డు కూడా ఏర్పాటయ్యింది. ఓ సాధారణ బీజేపీ కార్యకర్తను ఈ బోర్డుకు చైర్మన్‌గా నియమించడం గమనార్హం.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి..
2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అనంతరం ఒంటరి పోరుకు ప్రాధాన్యమిచ్చి ఎన్నికల్లో బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లతో ఒక్క సీటే గెలిచిన బీజేపీ, 5 నెలల వ్యవధిలో జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో 4 స్థానాల్లో గెలిచింది. తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఊహించని విధంగా గణనీయమైన సీట్లు సాధించి, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాగత సమస్యలతో 13 శాతం ఓట్లతో 8 స్థానాలకే పరిమితమైంది. 6 నెలల వ్యవధిలో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో 8 స్థానాల్లో గెలిచింది. బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో ఎవరున్నా.. ఢిల్లీలో మోదీయే ఉండాలనే లక్ష్యంతో ప్రజలు తీర్పు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు పొందిన బీజేపీకి ఇప్పుడు బీఆర్‌ఎస్ బలహీనపడడం ఒక మంచి అవకాశంగా చూస్తోంది.
8 స్థానాల్లో గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పార్టీ బలోపేతానికి ఎంపీలు కృషి చేస్తే సగం సీట్లలో పార్టీ పటిష్టపడినట్లే. గెలిచిన 8 మంది ఎంపీలు, రెండో స్థానంలో నిలిచిన మరో ఏడుగురు ఎంపీ అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసేలా అధిష్ఠానం వ్యూహాలు రూపొందిస్తున్నది. అధిష్ఠానం రాష్ట్రానికి తాయిలాలు ప్రకటిస్తే రాబోయే ఎన్నికల్లో తాము ప్రచారం చేసుకునేందుకే కాకుండా ప్రజల్లోనూ విశ్వాసం ఏర్పడుతుందని పార్టీ నేతలు చెప్తున్నారు.