calender_icon.png 6 October, 2024 | 9:53 PM

హైడ్రాపై బీజేపీ యూటర్న్

06-10-2024 02:08:02 AM

రేవంత్ సర్కారు తెచ్చిన హైడ్రా కమలనాథుల క్రమశిక్షణను ప్రశ్నార్థకం చేసింది. హైడ్రాకు మద్దతుగా కొందరు బీజేపీ నాయకులు.. అది వద్దేవద్దు అంటూ మరికొందరు వర్గాలుగా విడిపోయారు. హైడ్రా కూల్చివేతలను మొదట ఎంపీలు రఘునందన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్వాగతించారు. అక్రమ నిర్మాణాల ను కూల్చేయాల్సిందేనంటూ మాట్లాడారు.

ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి హైడ్రా పేరిట ఇష్టానుసారంగా కూల్చివేతలు చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

బాధితులంతా పేదలు, మధ్య తరగతి ప్రజలే కావడం.. అన్ని వర్గాల నుంచి ఈ అంశంపై వ్యతిరేకత ప్రారంభమవ్వడంతో హైడ్రాపై రెండు వర్గాలుగా విడిపోయిన బీజేపీ నాయకులూ ఏకం అయ్యారు.

హైడ్రా అంశానికి అనుకూలంగా మాట్లాడితే ఎక్కడ ప్రజా వ్యతిరేకత వస్తుందోనన్న భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుందని, అందుకే తమ నేతల్లో ఒక్కసారిగా మార్పు వచ్చిందని బీజేపీ శ్రేణులే చెప్పడం గమనార్హం. మొదట హైడ్రాపై ఆహా ఓహో అన్న బీజేపీ నేతలు.. తమ పార్టీనే ఇరకాటంలో పడటంతో  యూటర్న్ తీసుకున్నారని గుసగుసలాడుకుంటున్నారు.