02-04-2025 11:52:53 PM
13 రాష్ట్రాల్లో ముగిసిన సంస్థాగత ఎన్నికలు
పార్లమెంట్ సమావేశాల తర్వాత కసరత్తు
న్యూఢిల్లీ: ఏప్రిల్ చివరి నాటికి భారతీయ జనతాపార్టీకి (బీజేపీ) నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. వచ్చే వారం రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 19 రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించాక పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యాచరణ మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తోంది.
పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలి. ఇప్పటివరకు 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అధ్యక్షుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ అధిష్ఠానం మిగతా రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా పార్టీ చీఫ్‌ల ఎన్నికను పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతుంటాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి జాతీయ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. రెండోసారి పదవీకాలం 2024లో ముగిసినప్పటికీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.