హైదరాబాద్: బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని అన్నారని ఆయన తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి వీళ్లు భర్తీ చేశామని చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. అరకొర రుణమాఫీని చేసి మొత్తం పూర్తి చేశామని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, కర్ణాటక ఎమ్మెల్యే, సభ్యత్వ నమోదు ఇంచార్జి అభయ్ పాటిల్, బిజెపి రాష్ట్ర సంస్థాగత ఎన్నికల అధికారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.